
CM Chandrababu
CM Chandrababu : రాజకీయ నాయకులకు ఓపిక చాలా ముఖ్యం. హుందాతనంతో రాజకీయాల్లో గొప్ప పేరు వస్తుంది. అది ప్రజల్లో ఉన్న అభిమానాన్ని రెట్టింపు చేస్తుంది. నచ్చకపోతే కక్షగట్టడం, తను చెప్పినట్లు వింటే నెత్తిన పెట్టుకోవడం కాదు.. హుందాగా నిబంధనల ప్రకారం పని చేసుకుని పోయే అధికారులను ప్రోత్సహించడం పరిపాలనలో చాలా ముఖ్యం. సరిగ్గా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే చేస్తున్నారు. మొదటి నుంచి పరిపాలనలో ఆయనకంటూ విజన్ ఉంటుంది ఆయనకు.. అన్న మాటను నిజం చేస్తున్నారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయంలో అధికారులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించిన సంఘటనలు కోకొల్లలు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం టీడీపీ-జనసేన నాయకులను నానా ఇబ్బందులకు గురిచేశారు. దీంతో చంద్రబాబు అధికారంలోకి రాగానే కొందరు సెలవు పెట్టి వెళ్లగా.. మరికొందరిని బదిలీ చేశారు.
ఎన్నికల సమయంలో సీఎస్ గా పనిచేస్తూ.. వైసీపీ కోసం పనిచేశారన్న ఆరోపణలు వచ్చిన జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. దీంతో సీఎం చంద్రబాబు ఆయన స్థానంలో సీనియర్ అధికారి నీరబ్ కుమార్ ను నియమించారు. ఈ నెలాఖరున జవహర్ రెడ్డి రిటైర్ కావాల్సి ఉన్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఐపీఎస్ ఏబీతో వ్యవహరించినట్లే వ్యవహరిస్తుందని వైసీపీ ప్రచారం చేసింది. కానీ, చంద్రబాబు పాలన వేరు… పార్టీ వేరు అన్నట్లు హుందాగా వ్యవహరిస్తూ ఈ నెలాఖరున రిటైర్ కావాల్సి ఉన్న జవహర్ రెడ్డికి పోస్టింగ్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.
జవహర్ రెడ్డి మాత్రమే కాదు సీఎం జగన్ గా ఉన్నప్పుడు స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన పూనం మాలకొండయ్యకు కూడా పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఉన్న ఆమెకు జీఏడీ స్పెషల్ సెక్రెటరీగా పదవి కల్పించారు. ఈమె కూడా ఈ నెలాఖరు కల్లా పదవీ విరమణ చేయబోతున్నారు. కెరీర్ చివర్లో వారు బాధపడకుండా ఉండేందుకు, వైసీపీకి ఫేవర్ గా పనిచేసినా చంద్రబాబు హుందాగా నడుచుకుని, అధికారులకు గౌరవం ఇచ్చారని ఇదో మంచి కొత్త సంప్రదాయమని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.