Thalaivar-170:మూసేసిన కేసును తిరగతోడే పోలీసాఫీసర్ కథ?
Thalaivar-170:నేటి(డిసెంబర్ 12)తో సూపర్ స్టార్ రజనీకాంత్ 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తలైవర్ 170 నిర్మాతలు అధికారికంగా సినిమా టైటిల్‌ని ప్రకటించారు. వెట్టయన్ అనేది టైటిల్. తాజాగా విడుదల చేసిన వీడియోలో రజనీకాంత్ స్టైలిష్ గా కళ్లద్దాలు పెట్టుకుని తన ఎరను వేటాడటం గురించి డైలాగ్ చెబుతూ కనిపించారు. తలైవర్ 170 బృందం సూపర్ స్టార్ రజనీకాంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి టైటిల్ ని ప్రకటించడం ఆసక్తిని కలిగించింది.
జైలర్ భారీ విజయంతో 2023 రజనీకాంత్ కి అద్భుతమైన సంవత్సరంగా మారింది. ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా అవతరించింది. 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ భారతీయ చిత్రంగాను నిలిచింది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన జైలర్ లైఫ్ టైమ్ కలెక్షన్లు దాదాపు రూ.700 కోట్లు. రజనీకాంత్ కెరీర్ బెస్ట్ చిత్రంగాను రికార్డులకెక్కింది.
సూపర్ స్టార్ ఇదే ఉత్సాహంలో ఇప్పుడు తలైవర్ 170తో పెద్ద స్క్రీన్ పైకి వస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ రిటైర్డ్ ముస్లిం పోలీసు అధికారిగా కనిపించనున్నారు. న్యాయం కోసం క్లోజ్ చేసిన కేసును మళ్లీ తెరవాలని నిర్ణయించుకునే పోలీస్ అధికారిగా రజనీ కనిపిస్తారు. సుందరమైన తిరువనంతపురం, తిరునెల్వేలి, సందడిగా ఉండే ముంబై నగరంలో కీలక షెడ్యూళ్లను తెరకెక్కిస్తారు.
టైటిల్ లాంచ్ వీడియోలో `వేట ప్రారంభమైనప్పుడు ఎర పడిపోవాలి!` అనే డైలాగ్ ఆకట్టుకుంది. సస్పెన్స్, చమత్కారం, యాక్షన్‌తో సినిమా రక్తి కట్టించనుందని ఈ డైలాగ్ చెబుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి వంటి భారీ తారాగణం ఉంది. ఈ చిత్రానికి టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు.