TGSRTC : గ్రేటర్ హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. నగరంలో కొత్తగా బస్ పాస్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి నిల్చోవలసిన పని లేకుండా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా ఐటీ కారిడార్ కు సమీపంలో జేఎన్టీయూ బస్టాప్, లక్డీకాపూల్ బస్టాపుల్లో ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఈ కౌంటర్లు పనిచేస్తాయన్నారు. ఉదయం 6.30 నుంచి రాత్రి 8.15 గంటల వరకు బస్ పాస్ కౌంటర్లు పని చేస్తాయని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు గంటల కొద్దీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పని లేకుండా ఈ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
కాగా, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రయాణికుల కొత్తగా గ్రీన్ మెట్రో లగ్జరీ నెలవారీ బస్సు పాస్ లను ప్రవేశపెట్టారు. ఈ బస్సు పాస్ ధరను రూ.1900లుగా ధర నిర్ణయించారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 219 రూట్ నెంబరుతో సికింద్రాబాద్-పటాన్ చెరు మధ్య, 195 రూటు నెంబరుతో బాచుపల్లి-వేవ్ రాక్ పార్కు మధ్య, 127కె నెంబరుతో కొండాపూర్-కోఠి మధ్య ఏసీ బస్సులు నడుస్తున్నాయి. ఈ రూట్లలో ప్రయాణాలు సాగించేవారు గ్రీన్ మెట్రో లగ్జరీ నెలవారీ బస్సు పాసులను తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.