Electric buses : టీజీఆర్టీసీ గుడ్ న్యూస్.. కొత్తగా మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు
Electric buses : తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. ఈ బస్సుల ద్వారా కాలుష్యం తగ్గడంత్ పాటు ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభూతి కలుగుతుందని చెప్పారు.
తెలంగాణలో మహాలక్ష్మీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీనికి తోడు పాత బస్సులు నడుపుతుండడంతో అవి మొరాయించడంతో పాటు భారీ ఎత్తున వచ్చే పొగతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక నుచి సీట్లు దొరకవన్న టెన్షన్, పాత బస్సుల్లో ప్రయాణించే వెతలు తీరనున్నాయి. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ఓఆరఆర్ పరిధిలో కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
హైదరాబాద్ లోని రవాణా శాఖ కమిషనర్ కార్యాలయానికి సోమవారం వచ్చిన ఆయన కొత్తగా ఎంపికైన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్ పెక్టర్లకు (ఏఎంవీఐ) నియామక పత్రాలను అందించారు. అనంతరం మాట్లాడిన సీఎం కాలుష్యం లేకుండా నగరంలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపారు. కాలుష్య నియంత్రణలో భాగంగా ఎలక్ట్రిక్ ఆటోలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.