KCR : టీజీ @ 10: కేసీఆర్ పూర్తిగా ఫోకస్ చేయలేదా!
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత అసెంబ్లీ ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ పెట్టకపోవడంతోనే పార్టీ ప్రభుత్వానికి దూరమైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసమే తాను పుట్టానని చెప్పుకున్న కేసీఆర్ ను ప్రజలు కూడా తెలంగాణ పితామహుడిగా కీర్తించాలని కోరుకున్నాడు. ఇదంతా ఆయన అనుకున్నట్లుగానే జరిగింది. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికలు మాత్రం దెబ్బకొట్టాయి.
తెలంగాణ ఆవిర్భావానికి సంబంధించి పదేళ్ల వేడుకను వైభవంగా నిర్వహించాలని కలలు కన్న ఆయన కల చెదిరిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పదేళ్ల వేడుకల సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు సోనియాగాంధీని ఆహ్వానించాలని అధికార పార్టీ తీసుకున్న నిర్ణయం కేసీఆర్ ను పూర్తిగా పక్కన పెట్టిందనడానికి నిదర్శనం.
తెలంగాణ ఆవిర్భావానికి సహకరించిన సోనియా గాంధీని వేడుకలకు ఆహ్వానిస్తున్నామని.. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఎన్నికల సంఘాన్ని కోరుతున్నామని ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని కేసీఆర్ ఏనాడూ గుర్తించకపోవడం విచారకరం.
తెలంగాణ ఏర్పాటు కేవలం కేసీఆర్ కృషి ఫలితమే కాదు. నిజానికి, రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ గణనీయమైన పాత్ర పోషించింది. అయితే, కేసీఆర్ తన నాయకత్వాన్ని, తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని పదే పదే ప్రస్తావిస్తూ కాంగ్రెస్ కు ఏ మాత్రం క్రెడిట్ దక్కకుండా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురుదెబ్బ తగలడంతో సోనియాగాంధీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రాజకీయ కక్ష సాధింపుగానో, తెలంగాణ చరిత్రలో తమదైన ప్రాముఖ్యతను చాటుకునే మార్గంగానో భావించవచ్చు.