Tesla to Amaravati : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో సీఎంతో పాటు మంత్రులు కలిసి పని చేస్తున్నారు. తాము ఎంచుకున్న లక్ష్యం మేరకు పనిచేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచాలని వడి వడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కేంద్రం ముక్కుపిండి నిధులు తెస్తుండగా.. మంత్రి లోకేశ్ విదేశాలకు వెళ్లి పారిశ్రామిక వేత్తలను ఒప్పించి ఫ్యాక్టరీలను అమరావతికి తీసుకువస్తున్నారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి లోకేశ్.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ఎక్స్’ ద్వారా మీటింగ్ వివరాలను కొంత మేరకు అందించారు. 2023 ఆగస్టులో ఎలాన్ మస్క్ నేతృత్వంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పదోన్నతి పొందిన టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాను లోకేష్ కలిశారు. ఆస్టిన్ లోని టెస్లా ప్రధాన కార్యాలయంలో సమావేశమైన వారు ఆంధ్రప్రదేశ్ లో టెస్లా పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈవీ రంగానికి అనంతపురం వ్యూహాత్మక ప్రదేశం అని చెప్పారు, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. మా రాష్ట్ర డెవలప్ మెంట్ లో టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయ సహకారాలు అవసరమని ఆయన చెప్పారు.
తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారని, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చారని లోకేశ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారించినట్లు చెప్పిన లోకేశ్ టెస్లా ఈవీ తయారీ, బ్యాటరీ ఉత్పత్తి యూనిట్లకు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా వ్యూహాత్మక ప్రదేశం అని వివరించారు. సుస్థిర ఇంధన పరిష్కారాలపై దృష్టి సారిస్తూనే ఆర్ అండ్ డీ, ఇన్నోవేషన్ లపై దృష్టి సారించి ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ పార్కులను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ టెస్లాను సీఎఫ్ఓను కోరారు.