JAISW News Telugu

Terrorist Attack : యాత్రికుల బస్సుపై ఉగ్రవాదుల దాడి.. 10 మంది మృతి

Terrorist Attack

Terrorist Attack

Terrorist Attack : జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాడులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికుల బస్సుపై కాల్పులు జరిపారు. రియాసీ జిల్లాలోని శివ్ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్ గ్రామం వద్ద ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బస్సు లోయలో పడిపోయింది. పదిమంది యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందగా 33 మందికి గాయాలయ్యాయి. బాధితులందరూ ఇతర ప్రాంతాలకు చెందినవారేనని పోలీసులు తెలిపారు. ఎత్తయిన ప్రాంతంలో నక్కిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బస్సు లోయలోకి దొర్లుకుంటూ పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులతో కలిసి సహాయ చర్యలు చేపట్టారు.

రాత్రి 8 గంటల సమయంలో గాయపడ్డ యాత్రికులను రియాసీ, తెర్యాత్, జమ్మూలోని ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు, ఆర్మీ, సీఆర్ పీఎఫ్ బృందాలు రంగంలోకి దిగి ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. కాగా, ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోదీ పరిస్థితిని సమీక్షించారు. దాడికి బాధ్యులైనవారిని విడిచిపెట్టేది లేదని కేంద్రమంత్రి అమిత్ షా హెచ్చరించారు. ప్రధాని మోదీ, మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో, పలు దేశాల అధిపతులు వచ్చిన సందర్భంలో ఈ దాడి జరగడం దారుణమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యానించారు. కాశ్మీర్ లో శాంతిభద్రతలు ఆందోళనకర రీతిలో ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

Exit mobile version