liquor shops : మద్యం షాపులకు మందకోడిగా టెండర్లు.. మా వాటా మాకు ఇవ్వాల్సిందే  

liquor shops in AP : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంకీర్ణ ప్రభుత్వం… ప్రైవేట్ మద్యం షాపులకు టెండర్లు పిలిచింది. అయితే ఏపీలో మాత్రం మద్యం షాపులకు టెండర్లు మందకోడిగా దాఖలవుతున్నాయి. ఆరు రోజుల వ్యవధిలో 3,396 దుకాణాలకు 8,274 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. రాష్ట్ర సగటు లెక్కల ప్రకారం ఏపీ ఎక్సైజ్ శాఖకు ఒక్కో మద్యం షాపుకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయి. పెద్ద ఎత్తున సిండికేట్‌లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకు మించి మద్యం టెండర్లు వస్తున్నాయని అంచనా.. మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలుకు గడువు ముగియనుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలయ్యాయి. మన్యం జిల్లాలో అత్యల్పంగా దాఖలయ్యాయి.

దీనికి కారణం కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులని తెలుస్తోంది. వారు ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల పరిధిలోని మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకే వదిలేయాలని మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు సమాచారం. కొందరైతే తాము రూపాయి కూడా పెట్టుబడి పెట్టబోమని, అయినా తమకు వాటా ఇవ్వాలని, దానికి అంగీకరిస్తేనే దరఖాస్తు చేసుకోవచ్చని డిమాండ్ చేస్తున్నారట. కొందరు ప్రజాప్రతినిధులు నేరుగానే మద్యం వ్యాపారులకు ఆదేశాలిస్తుండగా.. మరికొందరు తమ ప్రధాన అనుచరులతో వారికి చెప్పిస్తున్నారు. తమను కాదని దరఖాస్తు చేస్తే.. తర్వాత వ్యాపారం ఎలా చేస్తారో చూస్తామంటూ హెచ్చరిస్తున్నారట. దీంతో మద్యం దుకాణాల లైసెన్సులకు ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రావట్లేదు.

రాష్ట్రంలోని 961 మద్యం దుకాణాలకు ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అత్యధికంగా తిరుపతి జిల్లాలోని 133 దుకాణాలకు దరఖాస్తులే రాలేదు. నెల్లూరులో 84, కాకినాడలో 58, ప్రకాశంలో 60, శ్రీసత్యసాయి జిల్లాలో 60, విశాఖపట్నంలో 60 దుకాణాలకు ఒక్క దరఖాస్తు రాలేదు. విజయనగరం జిల్లాలో 153 దుకాణాలను నోటిఫై చేయగా వాటిల్లో 5 మినహా మిగతా వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 855 దరఖాస్తులు వచ్చాయి. ఏలూరు జిల్లాలో 144 దుకాణాలు నోటిఫై చేయగా ఇప్పటివరకూ 706 దరఖాస్తులు అందాయి. 16 దుకాణాలకు  ఒక్క దరఖాస్తూ రాలేదు. ఎన్టీఆర్‌ జిల్లాలో 113 దుకాణాలు నోటిఫై చేయగా.. 613 దరఖాస్తులు వచ్చాయి.

రాష్ట్రంలో 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీ కోసం ఒక్కో దుకాణానికి సగటున 30 చొప్పున దాదాపు లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని, నాన్‌ రిఫండబుల్‌ రుసుంల రూపంలోనే ఏకంగా  రూ.2వేల కోట్ల వరకూ ఆదాయం వస్తుందన్నది ప్రభుత్వ అంచనా వేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి ఆరు రోజులు గడిచిపోయాయి. కానీ ఇప్పటివరకూ 8,274 దరఖాస్తులతో రూ.165.48 కోట్ల ఆదాయమే వచ్చింది. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. ఎక్సైజ్‌ అధికారుల అంచనా ప్రకారం ఈ పాటికే 30వేలకు పైగా దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నాయకుల తీరు వల్లే ఇలా జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

TAGS