TDP Janasena List : తెలుగుదేశం, జనసేన జాబితా ఆలస్యం.. వ్యూహత్మకమా?
TDP Janasena List : ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వ్యూహాలు మరింత రాటుదేలుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు సాధించడం ఇటు జగన్ కు అటు చంద్రబాబు, పవన్ లకు అత్యంత కీలకం. అందుకే ప్రతీ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. సామాజిక సమీకరణాలు ప్రధాన పాత్ర పోషిస్తుండగా..పార్టీలో అభ్యర్థులకు ఏ ఇబ్బంది రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకుల్లో విభేదాలను ముందే గుర్తించి వారిని ఐక్యంగా ఉంచడంలో పార్టీల అధిష్ఠానాలు చొరవ తీసుకుంటున్నాయి.
వైసీపీ ఇప్పటికే నాలుగైదు జాబితాల ద్వారా తన అభ్యర్థులను ప్రకటించింది. కానీ టీడీపీ-జనసేన కూటమి ఇంకా తమ అభ్యర్థులకు సంబంధించి ఒక్క లిస్ట్ కూడా విడుదల చేయకపోవడంతో రాజకీయ వర్గాల్లో అనూకూల, వ్యతిరేక వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఈ విషయాన్ని నెగిటివ్ గా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. కూటమికి అభ్యర్థులే దొరకడం లేదని, ఎన్నికల దాకా సీట్ల పంచాయితీలే ఉంటాయని ఎద్దేవా చేస్తున్నారు. ఇక తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికల నోటిఫికేషన్ వరకే ఓ దఫా నియోజకవర్గం మొత్తం చుట్టేస్తారని అంటున్నారు. జగన్ ప్రభుత్వం విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గెలుపు బావుటా ఎగురవేస్తారని విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అయితే వైసీపీలో పరిస్థితి ఇలా ఉంటే.. టీడీపీ, జనసేన అధినేతలు మాత్రం వ్యూహాత్మకంగానే అభ్యర్థుల ప్రకటనపై వేచిచూసే ధోరణిలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థుల ప్రకటన పూర్తైన తర్వాతే జాబితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కూటమి నేతలు.. ప్రతీ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు, బలమైన నేపథ్యం, ప్రజల్లో ఆదరణ..ఇలా పలు అంశాలను బేరిజు వేసుకుని జగన్ అభ్యర్థుల కంటే సమర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థులకు ఆదరణ ఉంటే.. ఆటోమాటిక్ ప్రచారం తక్కువ చేసిన గెలిచే అవకాశాలు ఉంటాయని గతంలో తెలంగాణలో అదే జరిగిందని అంటున్నారు.
మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ఎన్నికలకు మూడు, నాలుగు నెలల ముందే ప్రకటించింది. వారు ఊరూరు రెండు, మూడు సార్లు చుట్టేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ల చివరి రోజు కూడా పేర్లు ప్రకటించింది. అయినా కూడా వారు గెలిచారు. అదే ఏపీలో కూడా జరుగుతుందని అందుకే జాబితా లేటైనా.. గెలుపు గుర్రాలనే బరిలోకి దించుతామని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. అభ్యర్థులను మార్చినా ఆ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ‘‘మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. మార్చాల్సింది జగన్ నే’’ అనే నినాదంతో ముందుకెళ్తామన్నారు. లిస్ట్ ఎప్పుడూ ప్రకటించమా అన్నది ముఖ్యం కాదని విజయం సాధించామా లేదా అన్నదే ముఖ్యమని చెబుతున్నారు. ఈవిషయంలో కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందాల్సిన పని లేదని సూచిస్తున్నారు.