Telugu student killed in US : అమెరికాలో మరో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. కోటి ఆశలతో వెళ్లిన విద్యార్థులు ఇలా విగత జీవులుగా మారుతుండడంతో భారత్ లోని వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అమెరికాలోని గన్ కల్చర్ తో భారత విద్యార్థులు కొంత మేర ఆందోళన చెందుతున్నా.. ఉన్నత చదువుల కోసం వెళ్లి అక్కడి వారి చేతిలో హత్యకు గురవుతున్నారు.
ఈ ఘటనలు రాను రాను పెరుగుతున్నాయి. భారత అధికారులు కూడా వీటిని సీరియస్ గా తీసుకుంటున్నారు. ప్రమాదాల బారిన పడి కొందరు మరణిస్తుంటే.. మరి కొందరు డ్రగ్స్‌కు బలైపోతున్నారు. మరికొందరు హత్యలకు గురవుతున్నారు.
గుంటూరు జిల్లా, బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ బోస్టన్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మార్చి 11న, అభిజిత్‌ను యూనివర్సిటీ క్యాంపస్‌లో దుండగులు హత్య చేసి, అతని మృతదేహాన్ని సమీపంలోని అడవిలో కారులో వదిలేసి వెళ్లిపోయారు.
అభిజిత్ ఆచూకీ కనిపించకపోవడంతో అతడి స్నేహితులు యూఎస్ లోని పాలు ప్రాంతాల్లో వెతికారు. అక్కడి సన్నిహితులు, బంధు మిత్రులతో ఆరా తీశారు. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన దుండగులను పోలీసులు ఇంకా గుర్తించలేదు. మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు తెలుగు సంఘాలకు చెందిన కొందరు కృషి చేస్తున్నారు.
ఈ హత్యకు కారణమైన వారిని చట్ట పరంగా శిక్షించాలని భారత్ లోని అభిజిత్ కుటుంబ సభ్యులు యూఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తమ కొడుకు ఉన్నతంగా పట్టాతో ఇంటికి వస్తాడని అనుకుంటే శవంగా రావడం తమను కలిచి వేస్తుందని వారు వాపోతున్నారు.