Telugu States : రెండు రాష్ట్రాల పంచాయతీలకు ఫుల్ స్టాప్ పడనుందా?
Telugu States : తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశాబ్ధం పూర్తయ్యింది. ఇప్పటికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. ప్రతీ ఎన్నికలకు ఆ మంటలో పార్టీలు చలి కాచుకుంటూనే వస్తున్నాయి. విభజన సమయంలో ఒకవైపు చంద్రబాబు, మరో వైపు కేసీఆర్ పాలనలో ఉన్నారు. ఇద్దరూ సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుందాం అనుకున్నా రాజకీయ రంగు పులుముకోవడంతో చర్చలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
ఆ తర్వాత ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగనే రావాలని కేసీఆర్ మొదటి నుంచి కోరుకున్నారు. ఇక జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాతైనా పరిష్కారం దొరుకుతుందని అనుకున్న రెండు రాష్ట్రాల ప్రజలకు పరిష్కారం మాట పక్కనపెడితే మరింత జఠిలం చేశారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం తాము రాజకీయంగా ఎటువంటి లబ్ధి పొందడం లేదని భావించి చూసీచూడనట్టు వ్యవహరించింది.
ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి. ఎన్డీయేలో టీడీపీ కీలకంగా ఉంది. ఏపీలో బీజేపీ కూడా కూటమి బలంతో వికసించింది. కాబట్టి ఈసారి రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే చర్చల్లో సమస్యలకు పరిష్కారం వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
రేపు (జూలై 6) ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇరు రాష్ట్రాల అంశాలపై చర్చకు కూర్చుంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు, నాయకులు, విశ్లేషకుల నుంచి రెండు రాష్ట్రాల ప్రజల వరకు అందరి దృష్టి వీరిపైనే ఉంది. పార్టీల పరంగా ఇద్దరిది భిన్న ధృవాలు అయినా వీరికి వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరికి గౌరవం, ప్రేమ, అభిమానం ఉన్నాయి.
కాబట్టి గత ప్రభుత్వం మాదిరిగా రాజకీయ లబ్ది ఆశించి కాలా యాపన చేయకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఇద్దరు నాయకులు ఒకడుగు ముందుకేస్తారని ఆశిస్తున్నారు. నేడు ఇరు రాష్ట్రాల సీఎంలు కేంద్ర పెద్దలతో చర్చలు జరిపి తమ రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై చర్చలు జరిపారు. కేంద్రం పరిధిలో ఉన్న విభజన సమస్యలను కూడా పరిష్కారం చూపాలని బీజేపీ పెద్దలకు వినతులు సమర్పించారు ఇద్దరు సీఎంలు.