Gopichand Thotakura : అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగువాడిగా గోపీచంద్ తోటకూర చరిత్ర సృష్టించనున్నారు. ‘బ్లూ ఆరిజిన్’ ఇటీవల ఒక విషయాన్ని వెల్లడించింది. తమ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్‌గా వెళ్లనున్నారు అని తెలిపింది.
1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేశారు. కల్పనా చావ్లా, రాజా చారి, సునీతా విలియమ్స్, శిరీష బండ్ల వీరంతా భారత సంతతికి చెందిన అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్ టూరిస్ట్‌గా గోపీచంద్ చరిత్ర సృష్టించబోతున్నాడు.
మొత్తం ఆరుగురు..
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష సంస్థ ‘బ్లూ ఆరిజిన్’. ఈ కంపెనీ ‘న్యూ షెపర్డ్ మిషన్’ పేరిట స్పేస్ టూర్ కు శ్రీకారం చుట్టింది. 2021లో బెజోస్ తో పాటు ముగ్గురు పర్యటకులు రోదసీయాత్ర చేపట్టారు. తర్వాత చేపట్టే ఎన్ఎస్-25 మిషన్‌కు గోపీచంద్ తోటకూర సహా ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ బిజినెస్ మ్యాన్ సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ బిజినెస్ మ్యాన్ కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షాయానానికి ఎంపికైన తొలి నల్లజాతి వ్యోమగామి. కానీ, వివిధ కారణాలతో ఆయనకు రోదసీలోకి వెళ్లే అవకాశం రాలేదు.
విజయవాడకు చెందిన గోపీచంద్
గోపీచంద్ తోటకూరది విజయవాడ. ప్రిజర్వ్ లైఫ్ సంస్థ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్నారు. పదేళ్ల క్రితం భారత్‌లో మెడికల్ ఎయిర్-ఎవాక్యుయేషన్ సేవలు నిర్వహించారు. బ్లూ ఆరిజిన్ ప్రకటించే వరకు తన కుటుంబానికి కూడా ఈ విషయం తెలియదని ఎకనామిక్ టైమ్స్‌తో గోపీచంద్ వెల్లడించారు. 8 సంవత్సరాల వయసులోనే అంతరిక్షంపై ఆసక్తి కలిగింది. ‘ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీ’ నుంచి ఏరోనాటికల్ సైన్స్ విభాగంలో బీఎస్సీ కంప్లీట్ చేశారు.
100 కిలో మీటర్ల ఎత్తుకు
బ్లూ ఆరిజిన్ ఇప్పటి వరకు 6 మిషన్లలో 31 మందిని అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీరంతా సముద్రమట్టానికి 80 నుంచి 100 కిలో మీటర్ల ఎత్తున ఉండే కర్మన్ లైన్ వరకు వెళ్లి వచ్చారు. 11 నిమిషాల పాటు ఈ యాత్ర సాగుతుంది. ధ్వని వేగానికి మూడు రెట్ల స్పీడ్‌తో వీరి స్పేస్ షిప్ దూసుకుపోతుంది. కర్మన్ లైన్‌ను దాటి నిమిషాల పాటు భారరహిత స్థితిని పొందుతారు. అక్కడి నుంచి భూగోళాన్ని చూస్తూ కిందకు వస్తూ పారాచూట్ల సాయంతో క్యాప్స్యూల్లో దిగుతారు.
స్పాన్సర్‌షిప్‌తో..
‘ఎన్ఎస్-25’ మిషన్‌కు సంబంధించి ఖర్చు ఇతరులు భరిస్తున్నారు. అది ఎవరు? ఎంత మొత్తం చెల్లిస్తున్నారనేది బ్లూ ఆరిజిన్ వెల్లడించలేదు. రిచర్డ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గెలాక్టిక్ కూడా గతంలో పర్యటక అంతరిక్షాయానాలు చేపట్టింది. రోదసీ టూరిస్ట్‌లను ఆకర్షించడంలో ఈ సంస్థలు పోటీ పడుతున్నాయి. స్పేస్ టూరిజం విలువ 2030 నాటికి 3 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.