Bobby Deol : బాలీవుడ్ హీరో తలరాత మార్చిన తెలుగు దర్శకుడు.. ఇప్పుడు ఫుల్ బిజీ
Bobby Deol : ఒకప్పటి సూపర్ స్టార్ ధర్మేంద్ర కుమారుడిగా బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన బాబీ డియోల్ మొదట్లో సక్సెస్ అయ్యాడు. తొలి చిత్రం బర్సాత్ తో సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత తన విజయ పరంపరను కొనసాగించాడు. కానీ ఆ తర్వాత ఒక్కొక్కటిగా పరాజయాలు మొదలయ్యాయి. ఇక హీరోగా పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. రెండు మూడేళ్ళ క్రితం ఈ హీరోకు పెద్దగా మార్కెట్ లేదు. అవకాశాలు కూడా తక్కువే. తండ్రి ధర్మేంద్ర, సోదరుడు సన్నీడియోల్ తో కలిసి చేసిన సినిమా కూడా అంతగా ఆడలేదు. దీంతో కెరీర్ బాగా వీక్ అయ్యింది. ఇక లాభం లేదనుకొని వెబ్ సిరీస్ పైనా దృష్టి పెట్టాడు. అవి కూడా పెద్దగా ఆడలేదు. అయితే ఆశ్రమ్ సిరీస్ మాత్రం మంచి పేరు తెచ్చింది. ఇక యానిమల్ సినిమా ఈ ఈ హీరోను తెరపై ఒక కొత్త విలన్ ను పరిచయం చేసింది. బాబీ కెరీర్ ను కొత్త మలుపు తిప్పింది. రెమ్యూనరేషన్ రూ.నాలుగు కోట్లు ఇవ్వడమే ఎక్కువనుకున్న బాబీ డియోల్ కు ఇప్పుడు రెట్టింపు రెమ్యూనరేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి గా వచ్చిన సక్సెస్ తో ఇప్పుడు బిజీ అయ్యాడు బాబీ. ఇప్పుడు ఉన్న కమిట్ మెంట్లతో తదుపరి సినిమాలకు డేట్లు దొరకడం కూడా కష్టంగా మారింది. దీనంతటికి కారణం మన తెలుగు దర్శకుడు సందీప్ వంగానే కారణం.
ప్రస్తుతం బాబీ డియోల్ సౌత్ టు నార్త్ వరుస ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. సూర్య నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ తో దక్షిణాదిలో పరిచయం అవుతున్నాడుు. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో ఔరంగజేబ్ గా నటిస్తున్నాడు. బాలకృష్ణ 109 సినిమాలోనూ బాబీ డియోలే విలన్. ఇక్కడే ఇలా ఉండగా, బాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. యష్ రాజ్ ఫిలిమ్స్ అలియా భట్, శార్వరి వాఘ్ తో తీస్తున్న లేడీ స్పై మూవీలో మెయిన్ విలన్ బాబీ డియోలే. మోహన్ లాల్ ఒప్పం హిందీ రీమేక్ లోనూ బాబీ కనిపించబోతున్నాడు.
బాబీ డియోల్ ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాలపై దృష్టి పెడుతున్నాడు. రెమ్యునరేషన్ ఎక్కువగా ఉండడమే కారణంగా తెలుస్తున్నది. ఇక సౌకర్యాలు కల్పించే విషయంలోనూ రెండు భాషల నిర్మాతలు కొంత వెసులు కల్పించడం మరో కారణం. ఒకవేళ సందీప్ రెడ్డి వంగా యానిమల్ లో బాబీ డియోల్ ని తీసుకోకపోయి ఉంటే ఇంకొన్ని రోజుల పాటు ఈ హీరో కమ్ విలన్ వెలుగులోకి వచ్చేవాడు కాదేమో.