Revanth Reddy:తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు మొదలైంది. అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు నుంచే కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ ఎస్‌కు షాక్ ఇస్తూ ముందంజలో నిలుప్తూ వచ్చింది. ఆ తరువాత బ్యాలెట్ ఓట్ల లెక్కింపులోనూ ఆధిక్యతను ప్రదర్శిస్తూ విజయ ఢంకా మోగించడం మొదలు పెట్టింది. కీలక నియోజక వర్గాల్లో అభ్యర్థులు విజయం సాధిస్తూ కాంగ్రెస్ అధికారం చేపట్టడం ఖాయం అని తేల్చేశాయి.
ఇప్పటికే అశ్వారావు పేటతో బోణీ కొట్టిన కాంగ్రెస్ అదే హవాని కొనసాగిస్తూ మ్యాజిక్ ఫిగర్ దిశగా దూసుకుపోతోంది. మరో వైపు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్‌లో విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు భారీ స్థాయిలో గాంధీభవన్ చేరుకుని సంబరాలు చేసుకోవడం మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ వెళ్లారు. ఆయనని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డిని డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్ మర్యాద పూర్వకంగా కలిసి అభినందించినట్టుగా తెలుస్తోంది. ఫలితాలని బట్టి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చచేపట్టనున్న నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి భద్రతను పెంచినట్టుగా తెలుస్తోంది.