America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ విద్యార్థిని మృతి
America : ఇటీవలి కాలంలో అమెరికాలో తెలుగు వారు ప్రమాదాలకు గురవుతూ మరణించడం, లేదంటే అదృశ్యమైన కేసులు ఎక్కువగా వింటున్నాం.., చూస్తున్నాం. రెండు నెలల కాలంలో నలుగురికిపైగా యువకులు కారు యాక్సిడెంట్ లో మరణించగా.. ఇప్పడు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఒక విద్యార్థిని దుర్మరణం పాలైంది.
అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఏదో ఒక ప్రమాదం సంభవించి భారతీయులు మరణిస్తూనే ఉన్నారు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు విద్యార్థిని దుర్మరణం పాలైంది. వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థిని తెలంగాణకు చెందిన గుంటుపల్లి సౌమ్యగా గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట జిల్లా సమీపంలోని యాదగిరిపల్లి ఆమె స్వగ్రామం.
అమెరికాలో ఆదివారం (మే 26) తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. సౌమ్య ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. కాలేజీ చదువుతో పాటు పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తోంది.
కాగా, సౌమ్య మృతితో ఆమె గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఇప్పటికీ షాక్ లో ఉన్నారు మరియు ఆమె ఇక తమతో లేరని అంగీకరించడానికి కష్టపడుతున్నారు. సౌమ్య మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. నివేదికల ప్రకారం, ఆమె ఈ నెల 11వ తేదీన తన 25వ పుట్టిన రోజు వేడుకలను కూడా జరుపుకుంది. సౌమ్య మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి సహకరించాలని సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు, బాలమణి, ఇతర కుటుంబ సభ్యులు అధికారులు, నేతలను అభ్యర్థించారు.