AP Buses : భారత్ లో సంక్షేమ పథకాలకు కొదువలేదు. దేశం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కొనసాగుతుండడంతో కచ్చితంగా వాటిని అమలు చేయాల్సిందే. కాకపోతే కొన్నింటినీ స్క్రీనింగ్ చేయాల్సి ఉందనే చెప్పాలి. ప్రజలు కూడా సంక్షేమ పథకాలు ప్రకటించినా పార్టీలకే ఓట్లు వేస్తున్నారు. ఒకవేళ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుంటే వారిని ఓడిస్తున్నారు. అందుకే పార్టీలు వినూత్న సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కొత్త ఆలోచనలు చేస్తున్నాయి.
ఈనేపథ్యంలో పుట్టుకొచ్చిందే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో హామీ ఇచ్చి అక్కడ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత తెలంగాణలో హామీ ఇచ్చి అక్కడా అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో కూడా ఈ పథకం అమలు చేయాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది. మిగతా పథకాల కంటే తక్కువ ఖర్చుతోనే అంటే ఏడాదికి మూడు, నాలుగు వేల కోట్లతోనే ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉండడం.. రాష్ట్రంలోని ప్రతీ మహిళా అర్హురాలు కావడంతో.. వారిని ఆకట్టుకోవచ్చనే ఆలోచనలో ఉంది. ఓటర్లలో సగం మంది మహిళలే ఉండడం కూడా ఎన్నికల వేళ ఈ పథకం బాగా అక్కరకు వస్తుందని ప్రభుత్వం భావించింది.
దీనిపై అన్ని కోణాల్లో ఆలోచించి తుది నిర్ణయం తీసుకోవాలని అనుకుంటోంది. ఈనేపథ్యంలో సంక్రాంతి పండుగ రావడం.. తెలంగాణలో మహాలక్ష్మి పథకం అమలు అవుతుండడంతో ఏపీఎస్ ఆర్టీసీకి లాభాలు కురిపిస్తోంది. తెలంగాణ పథకంతో అనూహ్యంగా ఆర్టీసీకి లాభాలు పెరగడంతో ‘మహిళలకు ఉచిత ప్రయాణం’పై నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కకు పెట్టింది. ఇక తెలంగాణ వల్ల అందించివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది.
ప్రతీ ఏడాది సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. దానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచుతుంది. ఈ ఏడాది సీజన్ మొత్తం 6,795 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ హైదరాబాద్ కే 1600 సర్వీసులు తిప్పుతోంది.
అదేస్థాయిలో తెలంగాణ ఆర్టీసీ కూడా ఏపీలోకి బస్సులను పంపుతుంది. కానీ ఈ ఏడాది తెలంగాణలో ఉచిత ప్రయాణం పథకం అమల్లో ఉండడంతో స్థానికంగా విపరీతంగా రద్దీ ఉంటోంది. ఇక తెలంగాణ ఏపీకి జనరల్ బస్సులతో పాటు స్పెషల్ బస్సులను నడపడం లేదు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న ఏపీఎస్ ఆర్టీసీ అదనంగా మరో 1400 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాల మధ్య తిరిగే బస్సులను హైదరాబాద్ టు ఏపీకి నడుపుతోంది.
ఒకేసారి దాదాపు 3000 బస్సులు అందుబాటులో ఉండడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికుల కష్టాలు తగ్గిపోయాయి. రిజర్వేషన్లు పెరిగి ఏపీఎస్ ఆర్టీసీకి లాభాల పంట పండుతోంది. ఫలితంగా తెలంగాణ మహాలక్ష్మి పథకం ఏపీఎస్ ఆర్టీసీకి ధనలక్ష్మీగా మారిందనే చెప్పాలి.