Sharmila : షర్మిలకు అండగా తెలంగాణ పోలీస్.. నువ్వు నేర్పిందే నీరజాక్ష!

Telangana Police in support of Sharmila

Telangana Police in support of Sharmila

Sharmila : ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకున్నా తర్వాత మరింత రంజుగా మారాయి. అన్న జగన్ పై షర్మిల విరుచుకుపడుతున్నారు. ఈక్రమంలో వైసీపీ సోషల్ మీడియా, మెయిన్ మీడియా..షర్మిల, ఆమెకు మద్దతుగా వచ్చిన సునీతారెడ్డిపై ఇష్టారీతిన, దారుణంగా ట్రోల్స్, బెదిరింపులు చేస్తున్నారు. వీటిపై వైఎస్ సునీతా రెడ్డి హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సునీతా ఇచ్చిన ఫిర్యాదుపై సైబరాబాద్ క్రైమ్ పోలీసులు 509, 506 ఐపీసీతో పాటు 67 ఐటీ యాక్ట్ వంటి కఠినమైన సెక్షన్లను చేర్చి కేసులు నమోదు చేశారు.

తనను, సోదరి షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నారని.. ఆధారాలు సైతం సునీతారెడ్డి సమర్పించారు. వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా పోస్టింగ్ లు పరిశీలించి కేసు నమోదు చేశారు. ‘‘శత్రు శేషం ఉండకూడదు..ఇద్దరిని లేపేయ్ అన్నాయ్.. ఎన్నికలకు పనికొస్తారు…’’ అని పోస్టింగ్ లు ఉండడం.. గతంలో జరిగిన చరిత్రను చూస్తే.. దీన్ని పోలీసులు సీరియస్ ఇష్యూగా గుర్తించారు. దీంతో వర్రా రవీందర్ రెడ్డిని నేడో రేపో అరెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చేస్తామన్నట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడిన కొద్ది గంటల్లోనే తెలంగాణ పోలీసులు ఈ కేసు నమోదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇన్ని రోజులు.. ఏపీ రాజకీయాల వైపు తెలంగాణ అధికార పక్షం చూడలేదు. షర్మిలకు రేవంత్ రెడ్డి ఎక్కడా బలమైన మద్దతు ఇస్తున్నట్టుగా కూడా కనిపించలేదు. కానీ ఇప్పుడు వైసీపీ నేతల వ్యవహారంతో.. షర్మిలకు తెలంగాణ వైపు నుంచి గట్టి మద్దతు ఇవ్వాలన్న అభిప్రాయానికి వచ్చినట్టుగా కనిపిస్తోంది.

గత ఎన్నికల్లో జగన్ రెడ్డికి..తెలంగాణ పోలీసులను యథేచ్ఛగా వాడుకునే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్. అందుకే డేటా చోరీ అంటూ పనికిమాలిన కేసులను పెట్టి టీడీపీ యాప్ ను నిర్వహిస్తున్న  ఐటీ కంపెనీలపై సోదాలు చేసి..టీడీపీ డేటా మొత్తం పోలీసుల సాయంతోనే చోరీ చేశారు. పైగా అంజనీకుమార్ వంటి ఐపీఎస్ అధికారులు మ్యాప్ లు ప్రదర్శించి ఇలా జరిగిందంటూ.. సొల్లు కథలు చెప్పి తప్పుడు ప్రచారాలు కూడా చేశారు. అదొక్కటే కాదు ఎన్నో కేసులు నమోదు చేశారు. అప్పట్లో ఏపీ పోలీసులపై నమ్మకం లేదని జగన్ రెడ్డి బహిరంగంగానే చెప్పేవారు. తర్వాత ఆయన చేతిలోకి ఏపీ పోలీసులు వచ్చేశారు. వారిని ఆయన ఎలా వాడుకున్నారో అందరూ చూశారు. ఇప్పుడు రివర్స్ లో తెలంగాణ పోలీసులు షర్మిల, సునీతారెడ్డికి అండగా నిలిచే అవకాశాలు కనపడుతున్నాయి.

TAGS