Telangana New Ministers:తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కొంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నేడు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికి కేబినెట్‌లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటీ శ్రీనివాసరెడ్డి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
నల్లగొండ జిల్లా నుంచి ఊహించిన విధంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అవకాశం కల్పించారు. వీరితో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఊహించిన విధంగానే సీతక్క, కొండా సురేఖ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్‌రెడ్డి, మెదక్ జిల్లా నుంచి దామోదర రాజనర్సింహ, ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి జూపల్లి కృష్ణారావు కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. మంత్రి వర్గ జాబితాలో ఉన్నవారికి రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్ చేస్తుండటం విశేషం.
అధికారిక కాన్వాయ్‌కి నో చెప్పిన రేవంత్ రెడ్డి...
ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రేవంత్ రెడ్డికి సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవిగుప్తా స్వాగతం పలికారు. ఆయనకు అధికారిక కాన్వాయ్‌ని ఏర్పాటు చేయగా రేవంత్ నిరాకరించారు. తాను ఇంకా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనందున అధికారిక కాన్వాయ్ వద్దంటూ వారించి మాణిక్‌రావ్ ఠాక్రేతో కలిసి సొంత వాహనంలో బయలుదేరారు. అయితే భద్రతా కారణాలరీత్యా రేవంత్ వాహనాన్ని అధికారిక కాన్వాయ్ అనుసరించింది.