Ponguleti Srinivas : తెలంగాణలో లోక్ సభ ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. మూడు ప్రధాన పార్టీలు మెజార్టీ సీట్లు సాధించడంపై దృష్టి సారిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధాని సహా ఆ పార్టీ నేతలు ప్రచారంలో మునిగిపోయారు. మాజీ సీఎం కేసీఆర్ బస్సుయాత్ర చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి 14 సీట్లు గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డితో కలిసి వెళ్లిన మంత్రి పొంగులేటి టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అంటూ.. మంత్రి ప్రశంసించారు. అందుకే ఎన్టీఆర్ ను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు తెలిపారు. మంచి పనులు చేసిన ఎన్టీఆర్, వైఎస్సార్ ను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్ల్లో కాంగ్రెస్ కు తెలుగు తమ్ముళ్లు మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో లోక్ సభ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్ల మద్దతు కావాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు.