Telangana : నిప్పుల కొలిమిలా తెలంగాణ.. రానున్న రోజుల్లో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు!

Telangana

Telangana

Telangana : గత పదేళ్లలో ఎప్పుడూ నమోదు కాని ఉష్ణోగ్రతలు ఈ సారి నమోదు కానున్నాయి. ఏప్రిల్ మధ్య భాగానికి రాకముందే భారీ ఊష్ణోగ్రతలతో బయట కాలు పెట్టలేని పరిస్థితి ఎదురైంది. తీవ్రమైన వడగాలులతో సాయంత్రం, ఉదయం వేళ్లలో మాత్రమే రోడ్లపై జనం కనిపిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే  పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం  (ఏప్రిల్ 07) 9 జిల్లాలు ఎండ వేడిమితో అతలాకుతలం అయ్యాయి. ఈ జిల్లాల్లోని 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాడ్పులు నమోదయ్యాయి. పదేళ్ల రికార్డులను పరిశీలిస్తే ఏప్రిల్‌లో ఈ స్థాయి వడగాలులు నమోదుకావడం ఇదే మొదటిసారి.

3.5 డిగ్రీలపైనే..
గతేడాదితో పోలిస్తే అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే నమోదవుతుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పుల వల్లే వాతావరణంలో వేడి భారీగా పెరిగిందని నిపుణులు చెప్తున్నారు. ఈ నెలలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాలులు వీస్తాయని, వృద్ధులు, బాలింతలు, చిన్నారులు, పక్షులపై ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రత కారణంగా ఏర్పడిన అల్పపీడనం మూలంగా సోమవారం నుంచి 11వ తేదీ వరకు ఉత్తర తెలంగాణ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణశాఖ పేర్కొంది.

ఉడుకుతున్న ఉమ్మడి నల్గొండ
ఈ ఏడాది వేడితో ఉమ్మడి నల్గొండ కుదేలవుతోంది. రాష్ట్రంలో మొదటిసారిగా మార్చి 30వ తేదీ వేములపల్లి, నిడమనూరు మండలాల్లో వడగాలులు వీచాయని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 6న మునుగోడు, వేములపల్లి, వలిగొండ, బొమ్మలరామారంలో నమోదయ్యాయి. జిల్లాలోని 10 మండలాల్లో బలంగా వడగాలులు వీస్తున్నాయి. సూర్యాపేట జిల్లాకు చెందిన రైతు కూలి వడదెబ్బతో మృతి చెందింది. ఖమ్మంలోనూ సాధారణం కన్నా 5 డిగ్రీలపైననే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

మారుతున్న వాతావరణం
రాష్ట్రంలో 60 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే చాలా వరకు మార్పులు వచ్చాయి. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 0.3-3.5 డిగ్రీలు పెరిగాయి. ఇలానే కొనసాగితే ఈ శతాబ్దం ముగింపు నాటికి 2 నుంచి 4 డిగ్రీలు పెరగవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇది ప్రమాదకరం అంటున్నారు. పారిశ్రామికీకరణ, కర్బన ఉద్గారాల వల్ల హైదరాబాద్‌కే ప్రత్యేకమైన సమశీతల వాతావరణం మెల్ల మెల్లగా దెబ్బతింటోంది.

సముద్ర మట్టానికి 530.3 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సిటీ పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సగటు 0.5- 0.8 డిగ్రీలు పెరిగాయి. రోజువారీ సగటు ఉష్ణోగ్రత 32.2- 33 డిగ్రీలు, రాత్రి 20.6- 21.1 డిగ్రీలకు పెరిగాయి. ఖమ్మంను పరిశీలిస్తే గడిచిన 30 ఏళ్లలో 3.6 డిగ్రీలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

TAGS