Telangana : రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాలు 40 డిగ్రీల మార్కును దాటేశాయి. 45 డిగ్రీల కంటే అధికంగా ఎండ తీవ్రత భయపెడుతోంది. తెలంగాణలోని చాలా ప్రాంతాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
మధ్యాహ్న సమయంలో..
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అత్యవసరమైతే జాగ్రత్తలు తీసుకుని రావాలి. నెత్తిన టోపీ, తలపై రుమాలు, కాటన్ దుస్తులు ధరించి, చేతిలో మంచినీళ్ల సీసాతో ఉండాలి. దాహం అనిపించినప్పుడల్లా మంచినీరు తాగుతుండాలి. లేకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురైతే వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది.
రెడ్ జోన్ లో..
రాష్ట్రంలోని పలు ప్రాంతాలు రెడ్ జోన్ లోకి వెళ్లాయి. 10 ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మికుంట(కరీంనగర్), మంథని (పెద్దపల్లి), నిడమనూరు (నల్గొండ), మిర్యాలగూడ (యాదాద్రి భువనగిరి), వెల్గటూరు (జగిత్యాల), వీణవంక (కరీంనగర్), మాడుగులపల్లి (నల్గొండ), అల్లీపూర్ (జగిత్యాల), మాతూరు (నల్గొండ) ప్రాంతాలు రెడ్ జోన్ లో ఉన్నాయి.
ఉత్తర, మధ్య ప్రాంతాల నుంచి..
భారత దేశంలోని ఉత్తర, మధ్య ప్రాంతాల నుంచి వేడి గాలులు వీస్తాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 50 డిగ్రీలకు చేరే సూచనలున్నాయి. వచ్చే ఐదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ జిల్లాల్లోనూ..
ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, భూపాలపల్లి, గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మలుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట జిల్లాల్లో వేడి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. హైదరాబాద్ లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయి. 42-43 డిగ్రీల వేడి ఉండనుందని తెలుస్తోంది.