CM Camp office:తెలంగాణ సీఎం కొత్త‌ క్యాంప్ కార్యాల‌యం అక్క‌డే?

CM Camp office:తెలంగాణ ముఖ్య‌మంత్రి కోసం కొత్త క్యాంప్‌ కార్యాల‌యాన్ని న‌ర్మించ‌బోతున్నారా?.. ఇందు కోసం స్థ‌లాల ప‌రిశీల‌న జ‌రుగుతోందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డికి కొత్త క్యాంప్ కార్యాల‌యం ఏర్పాటుకు గ‌చ్చిబౌలి, రాయ‌దుర్గం, ఖాజాగూడ ప్రాంతాల్లో స్థ‌లాల‌ను అధికారులు ప‌క‌రిశీలిస్తున్నారు. ఉన్న‌త స్థాయిలో అందిన ఆదేశాల మేర‌కు రెవెన్యూ అధికారులు స్థ‌లాల ప‌రిశీల‌న‌పై దృష్టి సారించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సాధార‌ణ పౌరుల నుంచి విన‌తుల‌ను స్వీక‌రించ‌డానికి ప్ర‌గ‌తిభ‌వ‌న్‌నే ఉప‌యోగిస్తూ వ‌చ్చారు.

దీంతో ముఖ్య‌మంత్రికి క్యాంప్ ఆఫీస్ లేదు. ఆయ‌న జూబ్లీహిల్స్‌లోని త‌న సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్క‌డ క్యాంప్ కార్యాల‌యం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ స‌మ‌స్య‌లు ఏర్పడ‌తాయ‌నే ఉద్దేశంతో అధికారులు ప్ర‌త్యామ్నాయాల‌పై దృష్టి సారించారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసే ప్రాంతంలో సాధార‌ణ ప్ర‌జ‌ల రాక‌పోక‌ల‌కు ఇబ్బంది లేకుండా, ఆయ‌న కాన్వాయ్ సులువుగా ఔట‌ర్ రింగ్ రోడ్డును ఉప‌యోగించుకోవ‌డానికి అనుకూలంగా ఉన్న ప్ర‌దేశాల‌ను అన్వేషిస్తున్నారు.

శేరిలింగంప‌ల్లి త‌హ‌శీల్దార్ కార్యాల‌యానికి ఉన్న‌తాధికారుల నుంచి ఫోన్‌లు రావ‌డంతో అధికారులు ప్ర‌భుత్వ భూముల వివ‌రాల‌ను రంగారెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌, సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్‌కు స‌మ‌ర్పించిన‌ట్టుగా తెలిసింది. ఎంత స్థ‌లం అవ‌స‌రం అవుతుంది? ఏది అనుకూలంగా ఉంటుంది అనేది ఉన్న‌తాధికారులు ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ల‌నున్నార‌ని స‌మాచారం. మ‌రో వైపు ప్ర‌భుత్వ ఖాళీ స్థ‌లం కేటాయించి భ‌వ‌నాన్ని నిర్మించాలా? ..లేదంటే అనుకూలంగా ఉన్న ప్ర‌భుత్వ భ‌వ‌నాల్లో ఏర్పాటు చేయాలా? అనే అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టుగా తెలిసింది. ప్ర‌జ‌ల‌కు ట్రాఫిక్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌కూడ‌ద‌ని, క్యాంప్ కార్యాల‌యం శేరిలింగంప‌ల్లి మండ‌లంలోనే బాగుంటుంద‌ని రేవంత్‌రెడ్డి భావిస్తున్న నేప‌థ్యంలో రెవెన్యూ అధికారులు స్థ‌లాల‌ను సేక‌రిస్తున్న‌ట్లు స‌మాచారం.

TAGS