CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. కేబినెట్ విస్తరణపై రేపు మరోసారి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గేతో పాటు ముఖ్య నేతలతో సీఎం భేటీకానున్నారు. కేబినెట్ లో ఎవరికి అవకాశం కల్పించాలన్న దానిపై చర్చించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో రాజ్యసభ ఎంపీ కే కేశవరావు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. అలాగే తన ఎంపీ పదవికి కేశవరావు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన కూతురు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు.
ఈ నెల 4న కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉందనే వార్తలు వెలువడ్డాయి. ఆషాఢం వస్తుండడంతో 4వ తేదీ లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అందరూ భావించారు. సీఎం ఢిల్లీ పర్యటన నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ పై ప్రకటన ఉంటుందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.