Telangana budget : తెలంగాణ బడ్జెట్.. ప్రజల ఆశలపై నీళ్లు జల్లేలా ఉందని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గురువారం మధ్యాహ్నం బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. మా పాలనలో ఎన్నో పథకాలు పెడితే, వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించిందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు, మత్స్యకారులకు ఇలా వర్గానికి మేలు చేసేలా లేదు. ఐటీ, పారిశ్రామిక విధానాలు లేవు. తెలంగాణ బడ్జెట్ ఒట్టి గ్యాస్, ట్రాష్. బడ్జెట్ లో ఆర్థికమంత్రి ఒత్తి ఒత్తి మాట్లాడారే తప్ప కొత్తగా ఏమీ చెప్పలేదు. రాజకీయ ప్రసంగంలా ఉందే తప్పా, ఏ ఒక్క వర్గానికి మేలు చేసేలా లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు మాసాల సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ బడ్జెట్ చూశాక ఒక పాలసీ లేకుండా ఉందని అన్నారు. రైతు భరోసా ప్రస్తావనే లేదు.. ఇది పూర్తిగా రైతు శత్రుత్వ ప్రభుత్వమని విమర్శించారు. భవిష్యత్తులో ఈ బడ్జెట్ పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని కేసీఆర్ అన్నారు.