Telangana Budget 2024 : కొత్త ప్రభుత్వం.. కొత్త బడ్జెట్.. రేవంత్ తొలి బడ్జెట్ తో మెప్పిస్తుందా?
Telangana Budget 2024 : తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భావించాక కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చింది. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ ను గద్దె దించి పాలనా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను అమలు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ హామీల్లో ఆరు గ్యారెంటీలే కీలకం. వీటిలో ఇప్పటికే రెండు హామీలను అమలు చేస్తోంది. మరో రెండింటిని అమలు చేయాలని కసరత్తు చేస్తోంది. ఈ భారీ హామీలకు దాదాపు 60 వేల కోట్ల అవసరం పడుతాయని అంచనా వేసింది. వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. ఆమేరకు నిధులను బడ్జెట్ లో కేటాయించాల్సి ఉంటుంది.
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు గురువారం గవర్నర్ తమిళిసై ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12గంటలకు శాసనసభలో ప్రవేశపెడుతారు. శాసన మండలిలో ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెడుతారు.
ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి పూర్తిస్థాయి నిధుల కేటాయింపు ఉండకపోవచ్చు. పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయం నాటికి ప్రభుత్వ వ్యయానికి సంబంధించి మాత్రమే నిధులు కేటాయిస్తారు. అయినా కూడా ఈ బడ్జెట్ కాంగ్రెస్ కొత్త ప్రభుత్వానికి మొదటిది కాబట్టి.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఏమేరకు ప్రతిబింబిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది.
ఈ తాత్కాలిక బడ్జెట్ రూ.2.95లక్షల కోట్లతో ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. కొత్త ప్రభుత్వం ప్రాధామ్యాల ప్రకారం..అత్యధికంగా సంక్షేమ రంగానికి రూ.40వేల కోట్లు, వ్యవసాయానికి రూ.30వేల కోట్లు, సాగునీటి పారుదల రంగానికి రూ.29వేల కోట్లు, విద్యుత్ శాఖకు రూ.18వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండవచ్చిని తెలుస్తోంది.
అయితే ఈసారి రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే నివేదికను విడుదల చేయడం లేదని సమాచారం. ఎందుకంటే ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే ఆర్థిక సర్వేను విడుదల చేస్తారని తెలుస్తోంది.