Bathukamma in USA : అచ్చ తెలంగాణ పండుగ బతుకమ్మ. ప్రపంచంలో పూలకు పండుగ చేసేది ఒక్క తెలంగాణ సంప్రదాయంలో మాత్రమే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా బతుకమ్మ ఒక్క తెలంగాణ ప్రాంతం మాత్రమే నిర్వహించుకునే వేడుక. ‘ఎంగిలికానిపూల’ బతుకమ్మతో మొదలైన వేడుకలు తొమ్మిది రోజుల పాటు వివిధ దశల్లో కొనసాగుతూ 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. అయితే ఇప్పుడు బతుకమ్మను ఇతర రాష్ట్రాలు.., కాదు.. కాదు.. ఇతర దేశాలు సైతం ఓన్ చేసుకుంటున్నాయి. అధికారికంగా నిర్వహిస్తున్నాయి.
అమెరికాలోని నార్త్ కరోలినా, జార్జియా, వర్జీనియా సహా పలు అమెరికా రాష్ట్రాలు, షార్లెట్, రాలీ వంటి నగరాలు ప్రత్యేక బతుకమ్మ పండుగ వారోత్సవాలు, తెలంగాణ హెరిటేజ్ వీక్ ప్రకటించడం ద్వారా బతుకమ్మను అధికారికంగా గుర్తించాయని చెప్పవచ్చు. ప్రకృతితో కలిసి ఆడి పాడేందుకు జరుపుకునే తెలంగాణకు చెందిన శక్తి వంతమైన పూల పండుగ బతుకమ్మ. ఈ పండుగ సంస్కృతిక ప్రాముఖ్యతకు ఇది గణనీయమైన గుర్తింపునిచ్చింది.
సంప్రదాయంగా మహిళలు జరుపుకునే ఈ పండుగ పూలతో బతుకమ్మను చేయడం నుంచి ప్రారంభమవుతుంది. చేసిన బతుకమ్మల మధ్యలో గౌరీ మాతను ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ప్రధాన వీధులు, ఆలయాల వద్ద వాటి చుట్టూ తిరుగుతూ ఆడడం, ఆ తర్వాత ప్రసాదం పంపిణీ, నిమజ్జనంతో ముగుస్తుంది. అమెరికాలో బతుకమ్మకు అధికారిక గుర్తింపు లభించడం చూస్తే విదేశాలలో తెలుగు సమాజం పెరుగుతున్న ఉనికి, సంస్కృతిక ప్రభావాన్ని తెలుపుతుంది.
అమెరికన్ రాష్ట్రాలు, నగరాలు చేసిన ఈ ప్రకటనలు తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ స్థాయిలో చాటడం, ప్రవాసులకు వారి మాతృభూమికి మధ్య సంబంధం పెంచుకోవడం, అమెరికాలో సంస్కృతిని ప్రోత్సహించడం వంటివి కనిపిస్తుంది.