Revanth vs KTR:రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్…ఆట మొదలైంది!

Revanth vs KTR:తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ స‌భ్యుల మ‌ధ్య స‌మ‌రం మొద‌లైందా?..అంతా అనుకున్న‌ట్టుగానే రానున్న రోజుల్లో రస‌వ‌త్త‌ర పోరు జ‌ర‌గ‌నుందా? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే సంకేతాల్ని అందిస్తున్నాయి. కాంగ్రెస్ ప్ర‌తి ప‌క్షంలో ఉన్న సంద‌ర్భంలోనూ, టీడీపీ పార్టీలో ఉన్న స‌మ‌యంలోనూ గులాబీ దండుపై ఒంటికాలిపై లేచిన రేవంత్ రెడ్డి త‌ను సీఎం కాగానే అస‌లు ఆట మొద‌లు పెట్టారా? అంటే అసెంబ్లీ స‌మావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు, గులాబీ దండుపై ఘాటుగా స్పందించిన విధానం చూస్తుంటే నిజ‌మేన‌ని స్ఫ‌ష్ట‌మ‌వుతోంది.

అందెశ్రీ రాసిన క‌విత‌తో…

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానం సంద‌ర్భంగా అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌తిప‌క్ష బీఆర్ఎస్ పార్టీ స‌భ్యుల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గ‌త ప‌దేళ్ల పాల‌న‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. `ఏమిరా.. ఏమిరా తెలంగాణ‌` అంటూ కేసీఆర్ పోక‌డ‌ల‌ను ఉద్దేశించి అందెశ్రీ రాసిన క‌విత‌తో సీఎం రేవంత్ రెడ్డి త‌న ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. కుటుంబ పాల‌న‌కు వ్య‌తిరేకంగా తెలంగాణ ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చార‌ని..మేం అనే అహాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు తిప్పి కొట్టార‌ని స్ప‌ష్టం చేశారు.

రేవంత్ రెడ్డి ప్ర‌సంగం ఆసాంతం మెరుపులు, తూటాల్లాంటి మాట‌ల‌తో వాడీ వేడీగా సాగింది. తెలంగాణ ప్ర‌జ‌లు విల‌క్ష‌ణ తీర్పు ఇచ్చార‌న్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల‌ను బీఆర్ఎస్ స‌భ్యులు తీవ్రంగా నిరాశ‌ప‌రిచార‌ని, బీఆర్ఎస్ పాల‌న కుటుంబపాలన‌కే ప‌రిమిత‌మ‌వుతుంద‌ని నిరూపించార‌ని ప్ర‌తిప‌క్ష పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన‌గా.. రేవంత్‌రెడ్డి ప్ర‌సంగానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డు త‌గిలారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు వారించారు.

ప్ర‌గ‌తిభ‌వ‌న్ ప్ర‌జ‌ల కోస‌మే నిర్మించార‌ని..అది ఇప్పుడు జ‌రుగుతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ గ‌డీని తెలంగాణ ప్ర‌జ‌ల కోసం బ‌ద్ద‌లుకొట్టామ‌న్నారు. ఈట‌ల‌, గ‌ద్ద‌ర్ని ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లోకి రానివ్వ‌కుండా అడ్డుకున్నార‌ని ఆరోపించారు. స‌భ‌లో బీఆర్ఎస్ స‌భ్యుల తీరు స‌రిగా లేద‌ని..తెలంగాణ ప్ర‌జ‌లు కాంగ్రెస్‌కు ఇంత పెద్ద అవ‌కాశం క‌ల్పించార‌ని రేవంత్ అన్నారు. ఎంతో మంది సీనియ‌ర్లు ఉన్నా వాళ్ల‌కు బీఆర్ఎస్ పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేద‌ని రేవంత్‌రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. బీఆర్ఎస్ హ‌యాంలో ప్ర‌జాస్వామ్యం ఖూనీ అయింద‌ని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల‌ను త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తామ‌న్నారు.

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విన‌డానికి ప్ర‌జా ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు. మేనేజ్మెంట్ కోటా అంటూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. అమ‌రుల కుటుంబాల‌కు బీఆర్ఎస్ క‌నీసం గౌర‌వం ఇచ్చిందా? అన్నారు. ఉద్య‌మాల పార్టీ ధ‌ర్నా చౌక్‌ను ఎందుకు తొల‌గించిందని ప్ర‌శ్నించారు. తొలి కేబినెట్‌లోనే గ్యారంటీల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించామని స్ప‌ష్టం చేశారు. కేబినేట్ నిర్ణ‌యాల‌కు శాస‌న‌స‌భ‌లో చ‌ట్టబ‌ద్ద‌త క‌ల్పిస్తామ‌న్పారు. అమ‌రుల కుటుంబాల‌ను బీఆర్ఎస్ అవ‌మానించింద‌ని, పార్టీ ఫిరాయించిన వారికి ఇచ్చిన మ‌ర్యాద అమ‌రుల కుటుంబాల‌కు ఇవ్వ‌లేద‌న్నారు.

మూడు నెల‌ల్లో అట్ట‌ర్ ఫ్లాప్…

రేవంత్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై బీఆర్ఎస్ నేత కేటీఆర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. మూడు నెల‌ల్లో ప్ర‌భుత్వం అట్ట‌ర్ ఫ్లాప్ అవుతుంద‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై  ప్రారంభోపాన్యాసం చేస్తూ గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై చేసిన వ్యాఖ్య‌ల‌పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. `మార్పు మొద‌లైంది. నిర్భంధం పోయింది` అంటూ మాట్లాడిన తీరుపై సెటైర్లు వేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండ‌బోతోందో అర్థ‌మ‌వుతోంద‌న్నారు. నాలుగో రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌లు ఎన్నుకున్న సీఎం కాద‌ని, ఢిల్లీ నామినేట్ చేసిన ముఖ్య‌మంత్రి అని ఎద్దేవా చేశారు.

64 మంది ఎమ్మెల్యేలు ఉన్నార‌ని కాంగ్రెస్ పార్టీ మిడిసిప‌డుతోంద‌ని, ఇంత మిడిసిపాటు ప‌నికిరాద‌న్నారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డిపై పంచ్‌లు వేశారు. `చీమ‌లు పెట్టిన పుట్ట‌లో దూరిన‌ పాము` అని రేవంత్ రెడ్డి చేసిన విమ‌ర్శ‌ల‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ అనే పార్టీలో మా భ‌ట్ట‌న్న‌, శ్రీ‌ధ‌ర‌న్న‌, ప్ర‌భాక‌ర‌న్న‌, మా దామోద‌ర‌న్న అదే విధంగా మా ఉత్త‌మ్ అన్న‌, కోమ‌టిరెడ్డ‌న్న.. వీళ్లంతా ఉన్న పార్టీలో దూరి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి తీసుకున్న ఆయ‌న చీమ‌లు పెట్టిన పుట్ట‌లో పాముల గురించి మాట్లాడితే చాలా చండాలంగా ఉంటుంది` అంటూ ఫైర్ అయ్యారు. ఇలా రేవంత్‌పై కేటీఆర్.. కేటీఆర్‌పై రేవంత్ ప‌దునైన మాట‌ల‌తో దాడి చేసుకున్నారు. అసెంబ్లీ స‌మావేశాల సాక్షిగా జ‌రిగిన తాజా ప‌రిణామాల‌పై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. చూస్తుంటే రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ మ‌ధ్య ఆట మొద‌లైన‌ట్టుగా క‌నిపిస్తోందని, రానున్న రోజుల్లో ఇది ఏ ట‌ర్న్ తీసుకుంటుందో .. ఎలాంటి సమ‌రానికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందేన‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు వాపోతున్నారు.

TAGS