Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నకే పట్టభద్రుల పట్టం

Teenmar Mallanna

Teenmar Mallanna

Teenmar Mallanna : చివరి వరకు ఉత్కంఠ నెలకొల్పిన వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఆఖరికి అధికార కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌ విజయం సాధించారు.  తెలంగాణలో మే 27న జరిగిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు శుక్రవారం ముగిసింది. ఎలిమినేషన్‌ ప్రక్రియలో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి వచ్చిన రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు ముగిసిన అనంతరం.. బీఆర్ఎస్ మద్దతిచ్చిన రాకేశ్‌రెడ్డి కంటే మల్లన్న 14 వేలకు పైగా ఓట్లతో ముందంజలో ఉండడంతో ఆయన గెలిచారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక రిటర్నింగ్‌ అధికారి దాసరి హరిచందన తీన్మార్ మల్లన్నను విజేతగా ప్రకటించారు. అనంతరం ఆయనకు గెలుపు ధ్రువీకరణ పత్రం అందించారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రేమేందర్ రెడ్డి, అశోక్ కుమార్ ప్రాధాన్యత ఓట్లు తక్కువగా రావడంతో ఎలిమినేషన్‌కి గురయ్యారు. తీన్మార్ మల్లన్న గెలవడంతో కాంగ్రెస్ నేతలు సంబురాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. అయితే, సాంకేతికంగా ఓడినా, నైతికంగా తన పార్టీనే గెలిచినట్లు వ్యాఖ్యానిచారు. మెజార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు శనివారం తెలియనున్నాయి. గత నాలుగుసార్లు బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించిన ఈ స్థానంలో తాజాగా కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిచారు.

బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు సుదీర్ఘంగా శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగింది. గురువారం తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసింది. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నుంచి ఎలిమినేషన్‌ ప్రక్రియ వరకు తీన్మార్ మల్లన్నకు.. రాకేశ్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు. ఎలిమినేషన్‌ ప్రక్రియలో రాకేశ్‌రెడ్డి, మల్లన్న కంటే సుమారు నాలుగు వేల వరకు ఎక్కువ ఓట్లు సాధించినా.. అప్పటికే మొదటి ప్రాధాన్యత ఓట్లలో మల్లన్నకు 18 వేల పైచిలుకు మెజార్టీ దక్కింది. కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 1,22,813 తొలి ప్రాధాన్యత ఓట్లు రాగా, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి రాకేశ్‌రెడ్డికి 1,04,248 తొలి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 43,313, స్వతంత్ర అభ్యర్థి అశోక్‌కుమార్‌కు 29,697 ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తీన్మార్‌ మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో అభ్యర్థి గెలుపునకు 1,55,095 ఓట్లు కావాలి. ఎమ్మెల్సీ ఉపఎన్నికలో మొత్తంగా 3,10,189 ఓట్లు పోల్‌కాగా, 25,824 చెల్లని ఓట్లు నమోదయ్యాయి.

TAGS