Team India : లంక సిరీస్ ప్రారంభానికి ముందే టీమిండియాలో తొలి వేటు

Team India

Team India

Team India : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ విజయంతో ఉత్సాహంగా ఉన్న టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం(జూలై27) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. అన్ని మ్యాచ్‌లు పల్లెకెలె వేదికలోనే జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన శ్రీలంకపై రికార్డులు, ఫామ్ పరంగా చూసినా ఇండియాదే పైచేయి. కోచ్‌గా గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియా ఆడే తొలి సిరీస్ ఇదే కావడంతో ఆసక్తి పెంచుతున్నది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, టీ20 వరల్డ్ కప్-2026 లక్ష్యంగా టీమిండియాను సన్నద్ధం చేయాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. దీని కోసం లంకతో జరిగే టీ20 సిరీస్‌తోనే తన కారాచరణ ప్రారంభించాలని భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కోచ్ గంభీర్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం సిద్ధమయ్యాడు.

టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా శివమ్ దూబె కూడా ఉన్నాడు. ఫైనల్‌  మ్యాచ్ లో  భారత్ విజయంలో దూబె కీలకపాత్ర పోషించాడు. 16 బంతుల్లో 27 పరుగులు తీశాడు. అయితే ఫైనల్ మ్యాచ్ మినహా టోర్నీ‌లో దూబె ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. నిలకడగా పరుగులు సాధించడంలో సఫలం కాలేకపోయాడు. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ వేశాడు. జట్టులో పూర్తిస్థాయి బ్యాట్స్‌మెన్ గానే ఎంపికయ్యాడు. దీంతో దూబెకు బదులుగా బ్యాటింగ్ లో నిలకడగా రాణిస్తున్న  రింకూ సింగ్‌ను జట్టులో కొనసాగించాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడు.

దూబె, రింకూ ఇద్దరు కూడా మిడిల్ ఆర్డర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే. కాగా రింకూ ఫినిషర్‌గా సత్తా చూపించగలడు. రింకూ ప్రతిభను కేకేఆర్‌ జట్టులో గంభీర్ స్వయంగా చూశాడు. దీంతో దూబెకు బదులుగా రింకూను తీసుకోవాలని  గంభీర్ భావిస్తున్నాడు. కాగా, హార్దిక్ పాండ్యా లాగా  బెస్ట్ ఆల్‌రౌండర్‌‌గా దూబెను సిద్ధం చేయాలని బీసీసీఐ కొంత కాలంగా భావిస్తుంది. దీనిని అమలు చేయాలని గంభీర్‌పై ఒత్తిడి తెస్తే రియాన్ పరాగ్‌ను పక్కనపెట్టి దూబెకు తొలి టీ20లో ఆడించే అవకాశం ఉంది. ఇక రింకూ సింగ్ టీ20 టీమ్ తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లే కనిపిస్తున్నది.

TAGS