India Vs England : టీ 20 ప్రపంచ కప్ లో టీం ఇండియా ఫైనల్ కు దూసుకెళ్లింది. ట్రినిడాడ్ లో ఇంగ్లండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియాకు విరాట్ కొహ్లి (9) పరుగులకే అవుట్ కాగా.. పంత్ నాలుగు పరుగులకే అవుటై వెనుదిరిగాడు. దీంతో ఇండియా 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఓ పక్క వికెట్లు పడుతున్నా మరో ఎండ్ లో రోహిత్ శర్మ తన దూకుడైన ఆటతీరుతో చెలరేగి బ్యాటింగ్ చేశాడు.
పంత్ ఔటైన తర్వాత రోహిత్ కు జోడిగా సూర్య ఇన్సింగ్స్ ను చక్కదిద్దారు. రోహిత్ శర్మ 39 బంతుల్లో 57 పరుగులు చేయగా.. సూర్య 47 పరుగులు చేసి ఔటయ్యారు. ఇలాంటి సమయంలో చివర్లో హర్ధిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ లు భారత్ స్కోరు ను 171 పరుగులకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ తో రాణించారు.
172 పరుగుల ఛేజింగ్ తో బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ కు కెప్టెన్ జోస్ బట్లర్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. 15 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఇందులో అయిదు బౌండరీలు బాదాడు. దీంతో పవర్ ప్లేలోనే స్పిన్నర్ అక్షర్ పటేల్ ను దింపగా.. బట్లర్ ను ఔట్ చేసి వికెట్ల పతనం ప్రారంభించాడు. అనంతరం అక్షర్ మరో రెండు కీలక వికెట్లు తీశాడు.
దీంతో ఇంగ్లండ్ బ్యాటర్లు ఏ దశలోనూ కోలుకోకుండా కుల్దీప్ యాదవ్, బుమ్రా, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి అదరగొట్టారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. బుమ్రా రెండు వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలోనే 103 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 2022 టీ 20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ కు ప్రతీకారం ఇండియా తీర్చుకున్నట్లయింది. ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడనుంది.