India Middle Order : ఐసీసీ వరల్డ్ కప్ 2023లో టీమిండియాకు మిడిల్ ఆర్డర్ లో కీలకంగా మారాడు కేఎల్ రాహుల్. అటు వికెట్ కీపింగ్ తోనూ ఆకట్టుకుంటున్నాడు. పలు కీలక మ్యాచ్ లు ఒడిసి పట్టాడు. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రాహుల్ అసలు ఎంపికవుతాడా అనే అనుమానం అందరిలో ఉండేది. కానీ జట్టులోకి వచ్చి తానేంటో నిరూపించుకున్నాడు.
ఇక రాహుల్ ఫామ్ చూసుకుంటే వన్డేల్లో రెండేళ్లుగా అసలు సెంచరీనే లేదు. ఓపెనర్ గా కూడా విఫలమయ్యాడు. గాయాల కూడా వేధించాయి. అయితే వరల్డ్ కప్ జట్టులో ఉంటాడా లేదా అనేది అనుమానంగా మారింది. ఈ దశలో కెప్టెన్ రోహిత్ , కోచ్ రాహుల్ ద్రావిడ్ ఎంతో నమ్మకం పెట్టారు. మిడిల్ ఆర్డర్ లో రాహుల్ దూకుడుగా ఆడుతూ విమర్శలు చేసిన వారు కూడా నోళ్లేళ్లబెట్టేలా చేసుకున్నాడు. ప్రస్తుతం జట్టులో డీఆర్ఎస్ నిర్ణయాల్లో కూడా రాహులే కీలకంగా మారాడు.
ఈ సిరీస్ ప్రారంభానికి ముందు రోహిత్, గిల్ ల జోడీ ఓపెనింగ్ బాధ్యత లు తీసుకుంది. దీంతో రాహుల్ ఏస్థానంలో వస్తాడనేది ఇక్కడ సంశయంగా మారింది. ఇక శ్రేయాస్ అయ్యార్ కూడా ఫామ్ లో ఉండడంతో జట్టుకు ఎంపిక చేశారు. ఇక కేఎల్ రాహుల్, ఇషాన్ ను కీపర్, బ్యాట్స్ మెన్ కింద ఎంపిక చేశారు. అయితే టోర్నీ ప్రారంభం నుంచి రోహిత్, కోహ్లీలు చెలరేగి ఆడుతుండగా, వారికి సైలెంట్ గా సహకరిస్తున్నాడు రాహుల్.
లీగ్ దశలో ఆస్టేలియాతో మ్యాచ్ లో 2 పరుగులకే మూడు కీలక వికెట్లు భారత్ కోల్పోగా , విరాట్ కోహ్లీతో కలిసి 165 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ మ్యాచ్ లో రాహుల్ 97 పరుగులు చేశాడు. ఇక నెదర్లాండ్స్ పై 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. సెమీస్ లో 20 బంతుల్లో 39 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఈ టోర్నీలో 10 మ్యాచుల్లో 9 ఇన్నింగ్స్ లు ఆడి 386 పరుగులు చేశాడు.
ఇక జట్టులో మిడిల్ ఆర్డర్ ఇప్పుడు రాహుల్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్ తో బలంగా ఉంది. అయితే దీంతో పాటు కీపింగ్ కూడా చేస్తూ రాహుల్ జట్టులో కీలకంగా ఉన్నాడు. ఇక పలు క్యాచులు, అవుట్ల విషయంలో డీఆర్ఎస్ తీసుకునే విషయంలో రాహుల్ ఇప్పుడు కెప్టెన్ రోహిత్ కు పెద్ద బలంగా మారాడు. ఇటీవల రెండు క్యాచ్ ల విషయంలో రాహుల్ చెప్పిందే నిజమైంది. ఏదేమైనా రాహుల్ నిశబ్దంగా జట్టుకు ఎంతో ఉపయోగపడుతున్నాడని అభిమానులు కొనియాడుతున్నారు.