JAISW News Telugu

Team India : తొలి మ్యాచ్ నుంచే అప్రమత్తం కావాల్సిందే..

Team India

Team India

Team India : టీ20 ప్రపంచ కప్‌ లో  ఇప్పటి వరకు 20 టీమ్‌లు లీగ్‌ స్టేజ్‌లో తలపడ్డాయి. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌ల్లోనూ టాప్ బ్యాట్స్ మెన్లకు చెమటలు పట్టాయి. ఇక ‘సూపర్-8’ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. టీమ్‌ ఇండియా సమరం ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. గ్రూప్-1లో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. ఇందులో ఏ జట్టను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పటికే పెద్ద జట్లకు షాక్ ఇచ్చి ఆశ్చర్యపరిచాయి.  

 అఫ్గాన్‌తో తొలి మ్యాచ్‌
ఈ టీ20 వరల్డ్ కప్ లో అఫ్గానిస్థాన్‌ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్నది. అన్నీ అనుకూలిస్తే ఎంత  పెద్ద జట్టునైనా మట్టికరిపించ గలదు. లీగ్‌ స్టేజ్‌లో న్యూజిలాండ్‌పై 84 పరుగుల తేడాతో విజయం సాధించడమే ఇందుకు ఉదాహరణ. టీ20 క్రికెట్‌లో  ఇది భారీ విజయమని చెప్పవచ్చు. గ్రూప్-సీలో వెస్టిండీస్, న్యూజిలాండ్‌ వంటి పవర్ ఫుల్ టీమ్ లతో పాటు కొత్తగా వచ్చిన ఉగాండా, పాపువా న్యూగినీతోనూ అఫ్గాన్‌ తలపడింది. ఇక్కడ నుంచి కివీస్‌ సూపర్-8కి వస్తుందని చాలా మంది వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి. అఫ్గాన్‌  కివీస్‌కు షాక్‌ ఇచ్చి  మిగతా చిన్న జట్లపైనా గెలుపొంది సూపర్-8కి అర్హత సాధించింది. విండీస్‌ చేతిలో మాత్రమే ఓటమి చవి చూడాల్సి వచ్చింది. అఫ్గాన్‌ కెప్టెన్ రషీద్‌ ఖాన్‌, గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, నబీ, నూర్ అహ్మద్, ఫరూఖి, నవీనుల్‌ హక్ వంటి ప్లేయర్లు జట్టును విజయతీరాలకు చేర్చుతున్నారు.   ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను తమవైపు తిప్పేస్తున్నారు. వరల్డ్‌ కప్‌లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ల జాబితాలో గుర్బాజ్ (167 ) ముందున్నాడు. బౌలర్ల విషయంలోనూ ఫరూఖీ  12 వికెట్లు పడగొట్టి టాప్ ప్లేస్ లో నిలిచాడు. ఈ జట్టుతో భారత్‌ ఈ నెల 20న తొలి మ్యాచ్‌లో తలపడనుంది.

బంగ్లాతోనూ జాగ్రత్త..!
గ్రూప్-డీ నుంచి రెండో స్థానంలో నిలిచిన బంగ్లాదేశ్‌కు లీగ్‌ స్టేజ్‌లో  నునాయాసంగా గెలుస్తూ వచ్చింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది. శ్రీలంక, నెదర్లాండ్స్‌, నేపాల్‌ను ఓడించి సూపర్‌-8కి చేరుకుంది. మాజీ కెప్టెన్ షకీబ్ అల్‌ హసన్  ఫామ్‌లో ఉండటం బంగ్లాకు కలిసొచ్చే అంశం. దక్షిణాఫ్రికాను కూడా చివరి దాకా వణికించిన బంగ్లా రెండో దశలో మరింత చెలరేగుతుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. మరీ ముఖ్యంగా భారత్‌తో ఆడేటప్పుడు ఆ టీమ్ అంతా చివరి దాకా పోరాడటం గతం మ్యాచ్ లలో గమనించవచ్చు.  షకీబ్‌తోపాటు కెప్టెన్ షాంటో, తన్జిద్‌, మహ్మదుల్లాను అడ్డుకోకుంటే ఓటమి తప్పదనే భావించాలి. ఇక బౌలింగ్‌లో ముస్తాఫిజర్‌ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా బ్యాట్స్ మెన్లపై స్పష్టమైన అవగాహన అతనికి ఉంది. రిషద్, తస్కిన్ కూడా తక్కువేం కాదు. ఈ నెల 22న బంగ్లాదేశ్‌తో సూపర్‌-8లో భారత్  తలపడనుంది.  

ఆస్ట్రేలియాతో అసలైన సవాల్‌!
గ్రూప్‌-బీ లో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన ఆస్ట్రేలియా మరోసారి టైటిల్‌ దక్కించుకునేందుకు దూసుకు వస్తున్నది. లీగ్‌ స్టేజ్‌లో కఠినమైన ప్రత్యర్థిగా భావించిన ఇంగ్లాండ్‌పైనా గెలుపొందింది. మిగతావన్నీ చిన్న జట్లే. నమీబియా, ఒమన్, స్కాట్లాండ్‌పై  అలవోకగా విజయం సాధించింది. తొలి దశలో ఆసీస్‌ ఆట తీరు సాధారణంగా ఉంటుంది. నాకౌట్‌ స్టేజ్‌ నాటికి ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తుంది. గత వన్డే ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరుకొనేందుకు కష్టాలుపడిన ఆసీస్‌.. చివరికి టైటిల్‌ నెగ్గిందంటే అసాధారణ పోరాట పటిమనే కారణం. వార్నర్, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా మరింత రాణిస్తున్నారు. ఐపీఎల్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ మార్కస్ స్టొయినిస్ గ్రౌండ్ లో చెలరేగిపోతున్నాడు. బౌలింగ్‌లో స్టార్క్, ఆడమ్ జంపా ప్రత్యర్థులను వణికిస్తున్నారు. పాట్ కమిన్స్‌ను కూడా బెంచ్‌కే పరిమితం చేసిందంటే  ఆ జట్టు బౌలింగ్‌ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసీస్‌తో భారత్ ఈ నెల 24న సెయింట్‌ లూసియా వేదికగా తలపడనుంది.

అన్నీ గెలిస్తే.. నో టెన్షన్
సూపర్‌-8లో టీమిండియా ప్రత్యర్థులు అఫ్గాన్‌, బంగ్లా, ఆసీస్‌. మూడు మ్యాచుల్లోనూ గెలిస్తే.. సెమీస్‌కు చేరుకొనేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే మాత్రం నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. టీమిండియాకు అఫ్గాన్, బంగ్లా నుంచి ప్రతిఘటన ఎదురైనా.. విజయావకాశాలు ఎక్కువే. తొలి రెండు మ్యాచ్‌లు ఈ జట్లతో ఉండడం టీమిండియాకు కలిసి రానుంది. ఈ గ్రూప్‌లో టీమిండియా టఫ్ ఫైట్ ఆసీస్‌ తోనే . ఒకవేళ మొదటి రెండు మ్యాచుల్లో ఒక్కటి ఓడినా.. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌లా మారుతుందనడంతో ఎలాంటి సందేహం లేదు. అలా జరగకుండా ఉండాలంటే వరుస విజయాలతో దూసుకెళ్లాల్సిందే. 

Exit mobile version