Team India : అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరిగే టీ-20 వరల్డ్ కప్ కు భారత జట్టును ఎంపిక చేసింది బీసీసీఐ. ఐపీఎల్ లో అదరగొడుతున్న కొత్త కుర్రాళ్లతో ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావిస్తే..అనూహ్యంగా సీనియర్లకే చాన్స్ ఇచ్చారు. 2022 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఆడిన 8మందికి మళ్లీ చోటు దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు జట్టు ఎంపికలో సీనియారిటీకి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో. అయితే యశస్వి జైస్వాల్, శివం దూబే జట్టులో ఉండడంతో కొంత కొత్తదనం తీసుకొచ్చిందని చెప్పవచ్చు.
అయితే ఈ జట్టు ఎంపికలో ఫ్యాన్స్ ను ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టు కలవరపెడుతోంది. ముంబై ఇండియన్స్ జట్టు అంటే అదొక సెమీ ఇండియా జట్టే. దేశానికి ఆడే మెజార్టీ ఆటగాళ్లు ఈ జట్టులోనే ఉంటారు. ఈ వరల్డ్ కప్ ఎంపిక చేసిన జట్టులో నలుగురు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లకు అవకాశం దొరికింది. రోహిత్ శర్మ, పాండ్యా, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్..ఈ నలుగురు ఆటగాళ్లు బీసీసీఐ ప్రకటించిన జట్టులో ఉన్నారు. ఈ నలుగురూ తుది జట్టులో ఉంటారు.
ప్రస్తుతం ఈ నలుగురి ఫామ్ ఫ్యాన్స్ ను భయపెడుతోంది. ఒక్క బుమ్రా తప్పితే మిగతా ముగ్గురిలో నిలకడ లేదు. రోహిత్ శర్మ పవర్ ప్లే సర్కిల్స్ లోనే దొరికిపోతున్నాడు. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన సూర్య ఒక్క మ్యాచ్ లో తప్పితే మిగతా మ్యాచ్ ల్లో సింపుల్ గా వికెట్ సమర్పించుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఆట మరిచిపోయినట్లు ఆడుతున్నాడు. ఈ నలుగురూ లీడ్ చేస్తున్న ముంబై జట్టు ప్రస్తుత ఐపీఎల్ పాయింట్ల పట్టికలో పాతాళానికి పడిపోయింది. ఇదే టీమిండియాలో ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. ఇలాంటి ఫామ్ తో కప్పును కొట్టగలరా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కాగా, ఈ నలుగురు కూడా అంతర్జాతీయ వేదికలపై మంచి ఆట కనబరిచే ఆటగాళ్లు. వారి అనుభవంతో జట్టును ముందుకు నడిపే సత్తా వారిలో ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మరి చూడాలి ఈ జట్టు కప్ ను తెస్తుందా..లేదా అనేది.