TDP – Amaravati : అధికారంలోకి టీడీపీ.. కళకళలాడుతున్న అమరావతి

TDP - Amaravati

TDP – Amaravati

TDP – Amaravati : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. అధికార మార్పిడి జరుగబోతుంది. ఇన్నాళ్లు వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది ఏపీ రాజధాని అమరావతి. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి గెలుపుతో మరో సారి కొత్త కళను సంతరించుకోనుంది అమరావతి. రాష్ట్రంలో ఎన్డీయే గెలుపు, అమరావతి రూపశిల్పి చంద్రబాబు సీఎంగా పదవిని అలంకరించనుండడంతో సీఆర్డీఏ ఆఘమేఘాలపై పనులను ప్రారంభించింది. త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలు కానుండడంతో రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపల తొలగింపు ప్రక్రియ మూడు రోజులుగా జోరుగా జరుగుతున్నాయి.   25 ప్రాంతాల్లో 94 జేసీబీలతో 109 కి.మీ. నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంప చెట్లను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండడంతో అప్పటిలోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు నానాకష్టాలు పడుతున్నారు.

 టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రభుత్వం అర్థంతరంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నిర్మాణాల పటిష్టత ఏ స్థాయిలో ఉందో తేల్చేందుకు ఇంజినీరింగ్‌ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఇతరత్రా పనులు మొదలు పెడతారు. ఇక కరకట్టపై వెలగని విద్యుద్దీపాలను సీఆర్డీఏ సిబ్బంది మార్చేస్తున్నారు. కరకట్ట రోడ్డుపై వెలగని 32 దీపాలను, మిగిలిన రోడ్లపై మరో 55 కొత్త లైట్లను మార్చారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుపై రెండు దశల్లో 9.60 కోట్ల రూపాయలతో ప్రారంభించిన సెంట్రల్‌ లైటింగ్‌ ప్రాజెక్టును కూడా పూర్తి చేశారు. వెంకటపాలెం నుంచి రాయపూడి గ్రామం వరకు మొత్తం తొమ్మిది కి.మీ. మేర ఈ మార్గంలో  వీధి దీపాలను ఏర్పాటు చేశారు.

కరకట్ట రోడ్డు, అసెంబ్లీ, హైకోర్టు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ అధికారుల నివాస సముదాయాలకు వెళ్లేందుకు మార్గాలు ముళ్ల పొదలతో నిండిపోయాయి. ప్రస్తుతం అధికారులు దగ్గరుండి వీటిని శుభ్రం చేయిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న న్యాయమూర్తుల బంగ్లాలు, న్యాయ సముదాయం, సచివాలయ టవర్లు, ఎన్జీఓ అపార్ట్‌మెంట్లు, విట్‌ నుంచి సచివాలయానికి వెళ్లే మార్గం, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, అమృత యూనివర్సిటీ, నవులూరులోని ఎంఐజీ లేఔట్, స్టేడియం, శాఖమూరు పార్కు, ఎన్‌ఐడీకి వెళ్లే మార్గాల్లో ముళ్లచెట్లను తొలగిస్తున్నారు.

TAGS