TDP Senior Leaders : ఏపీలో టీడీపీ కూటమి అఖండ విజయం సాధించింది. ఈ రోజు ఉదయం 11:27 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మంత్రి వర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే టీడీపీ కూటమి మిత్రపక్ష పార్టీలకు మంత్రి పదవుల పంపకం కూడా పూర్తయింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అందులో టీడీపీ నుంచి 20 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1 సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అయితే.. ఈ సారి ఫలితాల్లో రాజకీయ విశ్లేషకులకు సైతం అంతు పట్టని విధంగా 164 స్థానాలను సొంతం చేసుకుంది. బహుశా ఈ విజయాన్ని చంద్రబాబు సైతం ఊహించి ఉండరు. చారిత్రక విజయం నేపథ్యంలో మంత్రిపదవులు ఆశించే ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో.. ఆఖరి వరకు ఎవరికి మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందన్నది ఉత్కంఠ రేకెత్తించింది. ఈసారి మహిళలకు.. యువతకు మంత్రి పదవుల్లో ప్రాధాన్యత లభించింది. గతంలో కంటే ఈసారి అసెంబ్లీలో మహిళల సంఖ్య పెరిగింది. ఈసారి 21 మంది మహిళలు అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. గత అసెంబ్లీలో వీరి సంఖ్య 14 మాత్రమే ఉండేది. యువత సైతం పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. దీంతో.. వారికి ప్రాధాన్యత పెరిగే ఛాన్స్ ఉంది. దీనికి తోడు రానున్న పది – పదిహేనేళ్లు రాజకీయాల్లో కొనసాగే సామర్థ్యం ఉన్న వారికి అధిక అవకాశాలు లభించాయి. ఈ నేపథ్యంలో సీనియర్లు కొందరికి అవకాశాలు చేజారిపోయాయి. దీంతో పలువురు టీడీపీ సీనియర్లలో నిరాశ నెలకొంది.
మంత్రి పదవులు వస్తాయని ఆశించిన సీనియర్లకు భంగపాటు కలిగింది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న పాత్రుడు, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాస రావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, జీవీ ఆంజనేయులు తదితరుల మంత్రిపదవులు ఆశించిన వారిలో ఉన్నారు. అలాగే జేసీ అస్మిత్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన శ్రీనివాస రావుకు మంత్రి పదవులు దక్కలేదు.