MLC BTech Ravi Arrested : ఏపీలో కొంతకాలంగా ప్రతిపక్ష నేతలను వరుస కేసులతో అధికార పార్టీ ఇబ్బంది పెడుతున్నది. టీడీపీ అధినేతపైనే ఏకంగా 8 కేసులు పెట్టి, ఆయనను 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు పరిమితం చేసింది. ఇక ఇక్కడి తో ఆగేలా కనిపించడం లేదు. ఏపీలో ఆయా పార్టీల్లో కొంత ప్రాధాన్యం ఉన్న నేతలను కూడా ఇబ్బంది పెట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల, పయ్యావుల ఇలా అందరిపై పాత కేసులను తోడి ఎన్నికల నాటికి మరింత వేధించేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తున్నది.
అయితే తాజాగా మంగళవారం కడపలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఆయనపై నమోదైన పలు కేసుల్లో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. అయితే మంగళవారం రాత్రి పులివెందుల నుంచి కడపకు వెళ్తున్న బీటెక్ రవిని 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ఆ తర్వాత కాసేపటికి పోలీసులు తీసుకెళ్లినట్లు తెలవడంతో, అంతా ఊపిరి పీల్చుకున్నారు. వల్లూరు పోలీస్ స్టేషన్ కు ఆయన ను ముందుగా తరలించి, ఆ తర్వాత కడప రిమ్స్ కు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గతంలో కడప పర్యటనకు వచ్చిన సమయంలో విమానాశ్రయం వద్ద ఆందోళనకు దిగిన కేసులో బీటెక్ రవిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించినట్లు వల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దీనిపై గతంలో పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిని టీడీపీ ఖండించింది. పులివెందులలో సీఎం వైఎస్ జగన్ ఆగడాలను అడ్డుకుంటునందునే ప్రభుత్వం బీటెక్ రవిపై కక్ష కట్టిందని టీడీపీ ఆరోపించింది. బీటెక్ రవికి పార్టీ అండగా ఉంటుందని, రానున్న రోజుల్లో దీనికి బదులు చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి, ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నారని మరోసారి మండిపడింది.