TDP-Janasena Manifesto : టీడీపీ-జనసేన మ్యానిఫెస్టో రెడీ.. ప్రజల్లోకి వెళ్లడమే తరువాయి..
TDP-Janasena Manifesto : ఏపీ రాజకీయాలు రసపట్టుకు వచ్చాయి. వైసీపీ తన అభ్యర్థులను ప్రకటించుకుంటూ వెళ్తోంది. ఇక టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫెస్టో ఖరారు, అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. వైసీపీ మొత్తం అభ్యర్థుల ప్రకటన, ఎన్నికల షెడ్యూల్ విడుదల తర్వాత అభ్యర్థులను ప్రకటించాలని యోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నారు. ప్రతీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులకు దీటుగా బలమైన అభ్యర్థులను బరిలో దించాలని భావిస్తున్నారు. సామాజిక సమీకరణాలు, ధన, అంగ బలాలతో పాటు ప్రజల్లో మంచి పలుకుబడి ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దీంతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టోను కూడా రెండు పార్టీలు ఖరారు చేశాయి.
ఉమ్మడి మ్యానిఫెస్టోలో పొందుపర్చాల్సిన హామీలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి సమావేశమయ్యారు. చంద్రబాబు ఉండవల్లి నివాసంలో ఈ భేటీ ఏర్పాటైంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, కొందరు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలపై కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తంగా 12 అంశాలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోకు తుది రూపాన్ని ఇచ్చారు. వీలైనంత త్వరగా దీన్ని ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ లో విడుదల చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
కాగా, ఇప్పటికే టీడీపీ ఆరు గ్యారెంటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతీ సంవత్సరం 15వేలు తల్లుల అకౌంట్ లో జమ చేయడం, మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అమలు చేస్తామని వెల్లడించింది.
అలాగే యువగళం కింద ప్రతీ నిరుద్యోగికి రూ.3 వేల ఆర్థిక సాయం, ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీటి సరఫరా.. లాంటి వాటిని సూపర్ సిక్స్ గా నామకరణం చేశారు.
ఇక జనసేనాని కూడా వారాహి విజయయాత్ర సందర్భంగా పలు హామీలను ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్టు చెబుతున్నారు. టీడీపీ, జనసేన ఆరు చొప్పున హామీలతో కూడిన ఉమ్మడి మ్యానిఫెస్టోతో ఈ ఎన్నికలను ఎదుర్కొవాలని తీర్మానించినట్లు సమచారం. మ్యానిఫెస్టో ఖరారుతో ఇక దీన్ని జనాల్లోకి తీసుకెళ్లి వారి ఆదరణ చూరగొనాలని నేతలు భావిస్తున్నారు.