YCP Manifesto : ఏపీ ఎన్నికల వాతావరణం రసపట్టుకు వచ్చింది. పార్టీల అధినేతలు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. మండుటెండల్లో సైతం ప్రచారం జోరుగా చేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ ఇవాళ పార్టీ మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మ్యానిఫెస్టోను చదివితే మనకు కచ్చితంగా వేలంపాటే గుర్తుకువస్తుంది. టీడీపీ ఒకటి అంటే మేం రెండు అంటాం అనే తరహలోనే వైసీపీ మ్యానిఫెస్టోను తయారు చేసినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఏంటనేది ఏమాత్రం అవగాహన లేకుండా, అంచనా వేయకుండా రూపకల్పన చేసినట్టు నిపుణులు విమర్శిస్తున్నారు.
టీడీపీ సూపర్ సిక్స్ గ్యారెంటీలు విడుదల చేసిన టైంలో వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. టీడీపీ హామీలను అమలు చేయాలంటే రాష్ట్ర బడ్జెట్ సరిపోదని.. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారని ప్రశ్నించారు. అయితే అలా ప్రశ్నించిన వైసీపీ మ్యానిఫెస్టోలో రాష్ట్ర బడ్జెట్ ను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఓట్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్నట్టు ఉంది. మరి అలాంటి మ్యానిఫెస్టో తీసుకొచ్చిన వైసీపీ..ఈ హామీల అమలుకు ఎక్కడి నుంచి నిధులు తీసుకొస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వైఎస్ఆర్ చేయూత పథకం 75 వేల నుంచి లక్షా 50 వేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే అత్యధికంగా లబ్ధి పొందే అమ్మఒడి పథకానికి మాత్రం రెండు వేలు మాత్రమే పెంచడం గమనార్హం. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని చెప్పే జగన్ రెడ్డి.. మేనిఫెస్టోలో అంకెల గారడీని ప్రదర్శించారు తప్పితే ఆచరణకు సాధ్యమయ్యేలా హామీలను ఇవ్వలేదని అంటున్నారు.
మ్యానిఫెస్టోను చూస్తే అమాయక ప్రజల ఓట్లు దండుకునే ప్లాన్ తప్ప.. అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పన లాంటి భవిష్యత్ ప్రణాళికలు ఏమి కనపడడం లేదు. అయినా అధికారంలోకి వచ్చే నమ్మకమే లేనప్పుడు ఇలాంటి వేలంపాట మ్యానిఫెస్టోలనే రూపొందిస్తారని విమర్శలు చేస్తున్నారు. అయినా తమకు అధికారం రావాలనే తాపత్రయం తప్పా రాష్ట్ర ప్రజల బాగు వైసీపీ అధినేతకు అవసరం లేదంటున్నారు.