TDP and Janasena Alliance : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజాస్వామిక విధానాలు, ప్రగతి రహిత విధానాలపై కలిసి పోరాడడానికి టీడీపీ, జనసేన అధినేతలు జతకలిశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో మంచి పాలన తీసుకురావాలంటే పొత్తు అనివార్యమని చంద్రబాబు, పవన్ తమ నిర్ణయాన్ని ప్రజల ముందుంచారు. అలాగే రెండు పార్టీల కింద స్థాయి నేతల నుంచి పొత్తు ధర్మాన్ని బలపరుస్తూ రావాలంటూ ఇరు పార్టీల క్యాడర్ కు తమ తమ అధినేతలు ఆదేశించారు.
టీడీపీ, జనసేన అగ్రనాయకత్వం పొత్తులో భాగంగా రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణకు, ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదలకు సిద్ధమైన సమయంలో కొన్ని ప్రాంతాల్లో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశాల్లో కార్యకర్తలు, కొంతమంది నాయకులు రెండు పార్టీల ఉమ్మడి లక్ష్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీకి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, అలాగే చంద్రబాబు ఆపార అనుభవం రాష్ట్రానికి అవసరమని, జనసైనికులు టీడీపీ కార్యకర్తలను తక్కువ చేసి మాట్లాడవద్దని, అలాగే రెండు పార్టీల రాజకీయ పొత్తు రాష్ట్ర శ్రేయస్సును కాంక్షించే జరిగిందని, ప్రతీ ఒక్కరూ ఈ పొత్తుకు మద్దతుగా నిలబడాలంటూ తమ పార్టీ క్యాడర్ కు, నాయకులకు జనసైనికులకు పవన్ గతంలోనే పిలుపునిచ్చారు.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తనకు, పార్టీకి కష్టకాలంలో మద్దతుగా నిలబడిన పవన్ కల్యాణ్ ను అభినందించారు. రెండు పార్టీల పొత్తుతో ఏపీలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి పునస్థాపిద్దాం అంటూ తమ పార్టీ నేతలకు పొత్తు అవశ్యకతను వివరించారు. అలాగే లోకేశ్ కూడా జగన్ లాంటి భస్మాసురుడిని ఉనికి లేకుండా చేయాలంటే రెండు పార్టీల మధ్య పొత్తు అవసరమని దిశానిర్దేశం చేశారు.
తాజాగా ‘రా..కదిలిరా’’ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు సీట్లను ప్రకటించడం, ఆ తర్వాత తనకు ఒత్తిడి ఉందంటూ పవన్ కల్యాణ్ రెండు సీట్లను ప్రకటించడం.. ఇరు పార్టీల క్యాడర్ లో విభేదాలకు దారితీసింది. దీనితో పవన్ చేసిన సహాయాన్ని కూడా మరిచి టీడీపీ పొత్తు ధర్మానికి ముందుగా తూట్లు పొడిచిందని టీడీపీపై జనసేన సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక మీ పార్టీకి అంత సీన్ లేదంటూ కనీసం పవన్ ను కూడా గెలిపించుకోలేకపోయిన మీరా మాకు చెప్పేది అంటూ టీడీపీ శ్రేణులు..ఇలా ఇద్దరు కుస్తీలకు దిగి వైసీపీ గెలుపు కోసం పనిచేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.
తాజాగా.. రాజమండ్రి కాతేరులో టీడీపీ ‘‘రా..కదిలిరా’’ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీ నేతల నుంచే ప్రమాదం తప్పింది. రాజానగరం టికెట్ ను జనసేన ప్రకటించడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. కార్యక్రమం ముగించుకుని వస్తున్న చంద్రబాబును బొడ్డు వర్గీయులు అడ్డుకోవడంతో వారిని నిలువరించడానికి మరికొంత మంది అక్కడకు చేరుకోవడంతో తోపులాట జరిగి చంద్రబాబు కింద పడబోయారు. అక్కడే సెక్యూరిటీ సిబ్బంది అలర్ట్ కావడంతో ప్రమాదం తప్పింది.
పొత్తుకు వెళ్లినప్పుడు చిన్న చిన్న త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఇరు పార్టీల క్యాడర్,నాయకులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. పార్టీల అధినేతలు పొత్తులో భాగంగా సీట్లను ప్రకటించినప్పుడు ఆ నిర్ణయాలను గౌరవించి సదరు అభ్యర్థులను గెలిపించాలి. అంతే కాని ఇలా కుస్తీలు పడితే అసలుకే మోసం వస్తుందని ఇరుపార్టీల క్యాడర్ గుర్తించాలి.