JAISW News Telugu

TDP and Jana Sena : టీడీపీ, జనసేన సీట్ల పంపకం.. ఫిబ్రవరి మొదటివారంలో ప్రకటన

TDP and Jana Sena

TDP and Jana Sena

TDP and Jana Sena : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయాలు రసవత్తరంగా మారిపోతున్నాయి. వైసీపీ ఇప్పటికే కొంత మంది అభ్యర్థులను ప్రకటించడం పాటు ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల సమాయత్త సభలు పెడుతోంది. వీటిలో మొదటగా క్యాడర్, నాయకులకు జగన్ దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇక టీడీపీ, జనసేన కూటమి పొత్తులో భాగంగా సీట్ల పంపకాలను వేగంగా చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీట్ల సర్దుబాటు త్వరలోనే ఫైనల్ అయ్యే చాన్స్ కనిపిస్తోంది.

ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు, పవన్ కూడా రెండు సార్లు సమావేశమయ్యారు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలి.. ఏఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై ఇప్పటికే ప్రాథమికంగా వారు ఓ అవగాహనకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన చేస్తే..తర్వాత అసంతృప్తులను బుజ్జగించవచ్చని అనుకుంటున్నారు. పవన్ కల్యాణ్ ఇటీవల తమ పార్టీ పోటీ చేసే రెండు సీట్లను ప్రకటించారు. ఇక చంద్రబాబు అంతకుముందే రెండు సీట్లను వెల్లడించారు.

ఇది జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. పొత్తులో ఉండి ఇలా ఏకపక్షంగా సీట్లు ప్రకటించుకోవడం ఏమిటని పార్టీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పవన్ సర్దిచెప్పారు. తాను కూడా రెండు సీట్లను ప్రకటించడంతో వారు కొంచెం చల్లబడ్డారు. నిజానికి టీడీపీ, జనసేన ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న దానిపై ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చాయని.. అంతర్గతంగా ఏఏ సీట్లు అన్నది కూడా ఖరారు చేసుకుంటున్నారని అంటున్నారు. అభ్యర్థుల అంశంపైనా ఓ అంచనాకు వచ్చారని చెబుతున్నారు. అయితే బీజేపీతో జనసేన చర్చలు జరుపుతోంది.

తాము, జనసేన పార్టీలో పొత్తులో ఉన్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో అధికారికంగా పొత్తుల ప్రకటన చేయడంలో ఆలస్యమవుతుంది. అన్నీ అంశాలపై క్లారిటీ వచ్చాక.. ఫిబ్రవరి మూడు లేదా ఆ తర్వాత ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈలోపు చంద్రబాబు, పవన్ మరొకసారి భేటీ అవుతున్నారని చెబుతున్నారు.

Exit mobile version