TDP and Jana Sena : ఎన్నికలకు వెళ్లే ముందు.. ఫలితాల తర్వాత కప్పగెంతులు సహజమే. ఆంధ్రాలో కూడా ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరారు. చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ వారి చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేరారు. ఇప్పుడు కూడా వారి అనుమతి కోసం కొంత మంది ఎదురుచూస్తున్నారు. కానీ టీడీపీ, జనసేనలు హౌస్ ఫుల్ అయిపోయాయి. కనుక ఏ సిగ్నల్ ఇవ్వడం లేదు.
కానీ వైసీపీ అధీనంలో ఉన్న విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కొంత మందికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పదు. కనుక టీడీపీ ఇచ్చేసింది. జీవీఎంసీలో వైసీపీకి 58 మంది కార్పొరేటర్లున్నారు. టీడీపీ, జనసేన గేట్లు ఎత్తితే వారంతా రెండు పార్టీల్లోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ మొదటి విడతలో 20 మంది కార్పొరేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు సమాచారం.
ఈ విషయం తెలవడం తోనే.. జీవీఎంసీ కార్యాలయంలో శనివారం (జూలై 19) సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు హాజరవ్వానలి గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. కానీ 58 మందిలో 42 మంది మాత్రమే వచ్చారు. మిగిలిన 16 మంది హోటల్ లో సమావేశమయ్యారు. వారు వైసీపీ చేజారిపోయిట్లే భావించవచ్చు.
సమావేశానికి వచ్చిన వారు పార్టీ అధిష్టానం తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో పురుగుల్లా చూశారని, ఇప్పుడు మా అవసరం వచ్చిందా..? అంటూ నిలదీశారు. ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిలుగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డిని చాలా చులకనగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు రోజా, కొడాలి నాని, అంబటి రాంబాబు వంటివారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను చులకనగా మాట్లాడేవారని, సొంత పార్టీ కార్పొరేటర్లమైన తమను కూడా అలానే ట్రీట్ చేయడాన్ని సహించలేకపోతున్నామని వారు స్పష్టం చేశారు. అమర్నాథ్ వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ వినలేదు.. కనుక టీడీపీ, జనసేన కండువాలు సిద్ధం చేసుకుంటే వచ్చేసేందుకు వారు సిద్ధంగానే ఉన్నారనుకోవచ్చు.