Tata Motors : భారత్ దేశానికి బ్రాండ్ గా కొన్ని అగ్ర పరిశ్రమలు ఆనాదిగా కొనసాగుతున్నాయి. టాటా, మహీంద్రా, రిలయన్స్ వంటి సంస్థలు దేశ గౌరవాన్ని పెంచుతున్నాయి. దేశ పారిశ్రామిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇక టాటాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనదేశ పరిశ్రమ సత్తా చాటిన తొలి సంస్థ ఇదే. ఈ సంస్థ నుంచి వేలాది ఉత్పత్తులు బయటకు వస్తుంటాయి. అలాగే వాహన పరిశ్రమలో టాటా మోటార్స్ కీర్తి మనకు తెలిసిందే..
భారత వాహన తయారీ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ సరికొత్త ఘనత సాధించింది. మార్కెట్ విలువ పరంగా దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా అవతరించింది. డీవీఆర్ షేర్లు, కంపెనీ మార్కెట్ విలువ పరంగా మారుతీ సుజుకీని దాటేసింది.
టాటా మోటార్స్ విలువ రూ. 2,85,515.64 కోట్లు. టాటా మోటార్స్ లిమిటెడ్ డీవీఆర్ విలువ రూ.29,119.42 కోట్లతో కలిపి మొత్తం రూ.3,14,635.06 కోట్ల మార్కెట్ విలువతో ఆటోమొబైల్ కంపెనీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం రూ.3,13,058.50 కోట్లతో మారుతీ సుజుకీ రెండో స్థానానికి పరిమితమైంది.
మార్కెట్ ముగిసే సమయానికి టాటా మోటార్స్ షేర్ 2.19 శాతం పెరిగి రూ.859.25 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్ లిమిటెడ్ డీవీఆర్ షేర్లు 1.63 శాతం పెరిగి రూ.572.65కు చేరాయి. ఇంట్రాడేలో రూ.886.30 వద్ద 52 వారాల గరిష్ఠానికి చేరాయి. అదే సమయంలో మారుతీ సుజుకీ షేర్లు 0.36 శాతం నష్టంతో రూ.9,957.25 వద్ద ముగిశాయి.