Tamil YouTuber : తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తిరుమల సర్వదర్శనం క్యూలైన్ లో ప్రాంక్ వీడియోలు చేసిన తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందని యూట్యూబర్ వి.వైకుంఠవాసన్ (వీవీవాసన్), అతని స్నేహితుడు గోవిందరాజ రామస్వామిని తిరుమల టూటౌన్ పోలీసులు సోమవారం (జూలై 15) అరెస్టు చేశారు. వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కాండంతో భక్తుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తమైన సంగతి తెలిసిందే.
ఆలయ గౌరవానికి భంగం కలిగించడం, భక్తుల మనోభావాలు దెబ్బతీయడం, శాంతిభద్రతల సమస్యకు కారణమవడం వంటి వాటిపై టీటీడీ ఐటీలోని సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారి తిరుమల టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ నిందితులను అరెస్టు చేశారు. వారిని తిరుమలకు తీసుకు వచ్చాక పూర్తిగా విచారించి వీడియో చేయడానికి గల కారణాలు, అసలు ఉద్దేశాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.