Tamil YouTuber : శ్రీవారి భక్తులకు తమిళ యూట్యూబర్ క్షమాపణలు
Tamil YouTuber : తిరుమలలో భక్తులపై ఫ్రాంక్ వీడియో చేసిన తమిళనాడు యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్ క్షమాపణ చెప్పారు. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియో చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మేం కూడా శ్రీవారి భక్తులమే. భక్తుల ఇబ్బందులను చెప్పాలనే ఉద్దేశంతోనే క్యూలైన్ లో ఆ వీడియో తీశాం. వీడియో తీస్తుండగా తోటి మిత్రుడు చేసిన చర్యలు కొందరి మనోభావాలు దెబ్బతీశాయి. దీనికి మేం మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాం. ఇకపై అలాంటి వీడియోలు తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.
కాగా, ఇటీవల తిరుమలలో తమిళ యూట్యూబర్ టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు క్యూలైన్లలో ఫ్రాంక్ వీడియోలు తీశారు. వాసన్ మిత్రుడు ఒకరు నారాయణగిరి షెడ్లలో క్యూలైన్ లో వెళ్తూ.. కంపార్ట్ మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా ప్రవర్తించాడు. నిజంగానే తాళాలు తీస్తున్నారని భక్తులు ఒక్కసారిగా బయటకు వచ్చేందుకు సిద్ధమవుతుండగా అక్కడి నుంచి పరారయ్యాడు.