Dhanush : కొలివుడ్ (తమిళ సినీ) ఇండస్ట్రీని మరింత మెరుగుపరిచేందుకు తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్‌పీసీ) కొత్త నిబంధనలు తెచ్చింది. పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి రావాలంటే థియేటర్లలో రిలీజైన 8 వారాలు ఆగాల్సిందేనట. ఇది స్ట్రిట్ రూల్ అంటూ చెప్పుకచ్చారు.
ఈ సంవత్సరం (2024) నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త నిర్మాణాలు ప్రారంభించడం సహా సినిమా సంబంధిత కార్యకలాపాలన్నీ నిలిచిపోనున్నాయి. ఈ విరామం వచ్చే ఏడాది (2025) ఆగస్ట్ 16వ తేదీ వరకు ఉంటుందని కౌన్సిల్ చెప్పింది. నిర్మాతలకు ఆర్థికంగా నష్టం వాటిల్లకుండా నటులు, సాంకేతిక నిపుణులకు ఎంత పారితోషికం ఇస్తున్నారనే విషయాలను పరిష్కరించాలని కౌన్సిల్ భావిస్తోంది.
తమిళ సినీ నిర్మాతల మండలి (టీఎఫ్ పీసీ), థియేటర్ల యజమానుల నుంచి నటుడు ధనుష్ కు ఎదురుదెబ్బ తగిలింది. ధనుష్ పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్ రెమ్యూనరేషన్స్ తీసుకున్నాడని, కానీ షూటింగులకు ఒప్పుకున్న డేట్స్ ఇవ్వకుండా కమిట్మెంట్స్ నెరవేర్చడంలో విఫలమయ్యాడని వారు ఆరోపిస్తున్నారు.
కొత్త ప్రాజెక్టుల కోసం ధనుష్ ను ఎంగేజ్ చేసే ముందు తమను సంప్రదించాలని నిర్మాతలకు కౌన్సిల్ సూచించింది. 2023 లో, శ్రీ తేనాండాళ్ ఫిలిమ్స్ వద్ద కూడా ధనుష్ అడ్వాన్స్ తీసుకున్నాడని, కానీ షెడ్యూల్ షూటింగ్ కు హాజరు కాలేదని నివేదించింది. ఇది చాలా మంది అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అడ్వాన్సులు తీసుకొని, ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కొత్త ప్రాజెక్టులకు వెళ్లే పద్ధతిని టీఎఫ్ పీసీ విమర్శించింది. ఈ పద్ధతి తరచుగా నిర్మాతలకు గణనీయమైన ఆర్థిక నష్టాలను తీసుకువస్తుంది. అక్టోబర్ 30 నాటికి ప్రస్తుత షూటింగ్స్ అన్నీ పూర్తి చేయాలి.