T20 World Champions India : టీ 20 విశ్వ విజేత ఇండియా.. నరాలు తెగే ఉత్కంఠ పోరులో విజయం..
T20 World Champions India : టీ 20 విశ్వ విజేతగా ఇండియా నిలిచింది. శనివారం కెన్నింగ్ టన్ ఓవల్ బ్రిడ్జిటౌన్, బార్బడోస్ లో జరిగిన టీ 20 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. 2007 లో మొదటి సారి విశ్వవిజేతగా నిలిచిన భారత్, ఆ తర్వాత 17 సంవత్సరాలకు మళ్లీ పొట్టి ప్రపంచ కప్ అందుకుంది.
టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న ఇండియాకు మొదటి ఓవర్ లో విరాట్ కొహ్లి మెరుపు ఆరంభం ఇచ్చాడు. జన్ సేన్ బౌలింగ్ లో మూడు ఫోర్లు బాది 15 పరుగులు రాబట్టుకున్నారు. అనంతరం రెండో ఓవర్ వేసిన కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మొదటి రెండు బంతులు రెండు ఫోర్లు కొట్టాడు. అనంతరం మరో బౌండరీకి ప్రయత్నించి క్లాసెన్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 23 పరుగుల వద్ద రోహిత్ వెనుదిరగ్గా.. పంత్ ఖాతా తెరవకుండానే కేశవ్ మహరాజ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ మూడు పరుగులకే రబాడ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ కాగా.. ఇండియా 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.
ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్, అప్పటికే క్రీజులో కుదురుకున్న విరాట్ కొహ్లీ ఇన్సింగ్స్ ను బిల్డ్ చేశారు. అక్షర్ దూకుడుగా ఆడగా.. విరాట్ నింపాదిగా ఆడాడు. అక్షర్ పటేల్ (47) పరుగుల వద్ద రనౌట్ కాగా.. విరాట్ 76 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఇండియా మొదటి ఇన్సింగ్స్ లో 176 పరుగుల వద్ద ఇన్సింగ్స్ ముగించింది. అనంతరం 177 పరుగుల ఛేజింగ్ తో బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికాను 12 పరుగులకే రెండు వికెట్లు తీసి బుమ్రా, అర్షదీప్ మెరుపు ఆరంభం ఇచ్చారు.
అనంతరం డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. స్టబ్స్ ను అక్షర్ అవుట్ చేయగా.. 81 పరుగుల వద్ద దక్షిణాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 27 బంతుల్లోనే 52 పరుగులు చేసి హర్దిక్ బౌలింగ్ లో అవుటయ్యాడు. చివరి ఓవర్ లో 16 పరుగులు కావాల్సిన తరుణంలో హర్దిక్ వేసిన మొదటి బంతికే డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను సూర్య బౌండరీ లైన్ వద్ద అద్భుతంగా అందుకోవడంతో విజయం ఖాయమైపోయింది. హర్దిక్ చివరి ఓవర్ లో తొమ్మిదే పరుగులు ఇవ్వడంతో 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి ఇండియా సగర్వంగా టీ 20 ప్రపంచ కప్ ను ముద్దాడింది.