T-20 World Cup : ఐపీఎల్ హీరోలకు వరల్డ్ కప్ లో చోటేది?
T-20 World Cup : ఈ ఏడాది ఐపీఎల్ లో బ్యాటర్లు వీరవీహారం చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ యువ ఆటగాళ్లు విశేషంగా రాణిస్తున్నారు. పొట్టి క్రికెట్ లోనూ సెంచరీలను ఈజీగా బాదేస్తున్నారు. అయితే వీరిలో చాలా మంది టీ 20 వరల్డ్ కప్ కు మాత్రం ఎంపిక కాలేకపోయారు. ఐపీఎల్ లో అదరగొట్టినా వరల్డ్ కప్ ఎంపిక కాకపోవడంపై అభిమానులు ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
బీసీసీఐ తాజాగా టీ 20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన 15 మంది సభ్యుల జట్టులో రోహిత్ కెప్టెన్ గా, హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. అలాగే యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, సంజూ శాంసన్, రిషబ్ పంత్, యజ్వేంద్ర చాహల్ వంటి వారికి చోటు దక్కింది. అయితే ఈ జాబితాలో ప్రస్తుత ఐపీఎల్ ఫ్రాంచైజీలు భారీ పారితోషికాలు అందిస్తున్న కొందరు భారత ఆటగాళ్లు మాత్రం చోటు దక్కించుకోలేకపోయారు.
ఇలా ఐపీఎల్ లో భారీగా ఆర్జిస్తూ టీ 20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోలేకపోయిన ఆటగాళ్లలో కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (12.25 కోట్లు), లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్(17 కోట్లు), పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్ (11.75 కోట్లు), చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ దీపక్ చాహర్ (14 కోట్లు), ముంబై ఇండియన్స్ ఓపెనర్ ఇషాన్ కిషన్ (15.25 కోట్లు) ఉన్నారు. అయితే వీరు ఆర్జిస్తున్న మొత్తాలకు టీ 20 వరల్డ్ కప్ లో చోటు దక్కకపోవడానికి ఏమాత్రం సంబంధం లేదు. వారి వ్యక్తిగత ప్రదర్శనల ఆధారంగానే ఎంపిక కాలేకపోయారు. భారత జట్టులో ఎంపిక కావడానికి విపరీతమైన పోటీ ఉంది. అందుకే జట్టు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.