Swati Maliwal : ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్ సోమవారం కోర్టులోనే ఏడ్చేసింది. స్వాతి మాలీవాల్ పై దాడి కేసులో నిందితుడు అరవింత్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ కు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. అంతకుముందు వాదనల సందర్భంగా బిభవ్ కుమార్ కు బెయిల్ ఇస్తే తనకు, తన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంటుందని స్వాతి మాలీవాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె ఒక్కసారిగా ఏడ్చేసారు.
తాను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటి నుంచి రోజుకు రెండు, మూడు సార్లు విలేకరుల సమావేశాలు పెట్టి తాను బీజేపీ ఏజెంట్ నని ఆప్ తనపై దుష్ర్పచారం చేస్తోందని తెలిపారు. గతంలో ఆప్ వాలంటీర్ గా పనిచేసిన ఓ యూ ట్యూబర్ తనపై ఏకపక్షంగా ఓ వీడియో పోస్టు చేసిన నాటి నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ నెల 13న సీఎం కేజ్రీవాల్ నివాసంలో మాలీవాల్ ను ఛాతిపై, కడుపుపై, కటి భాగంలో బిభవ్ కొట్టారు. దీని ఆధారంగా ఈ నెల 18న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.