Ananthapur : స్వామిజీ నిర్ణయంతో ‘అనంత’లో మారనున్న లెక్కలు!

Ananthapur

Ananthapur, Swamij Paripoornananda

Ananthapur Politics : ఏపీ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పార్టీలన్నీ దాదాపు తమ అభ్యర్థులను ప్రకటించాయి. తాజాగా బీజేపీ కూడా పొత్తులో భాగంగా అభ్యర్థులను ఖరారు చేసింది. అయితే బీజేపీ పలుచోట్ల టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. దీంతో అక్కడి సీనియర్ నేతలకు సీటు దొరకలేదు. దీంతో వారు ఆగ్రహంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. రాయలసీమలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో పునర్వైభవం సాధించాలని టీడీపీ తహతహలాడుతోంది. అయితే కీలకమైన నియోజకవర్గంలో స్వామిజీ నిర్ణయంతో టీడీపీలో కాస్త ఆందోళన మొదలైనట్లు కనపడుతోంది.

కూటమి పొత్తులో భాగంగా బీజేపీ 6 ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. హిందూపురం ఎంపీ సీటుపై కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద ఆశలు పెట్టుకున్నారు. అయితే పొత్తు చర్చల్లో బీజేపీ హిందూపురం స్థానం దక్కలేదు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకున్న పరిపూర్ణానంద తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిని కలిసి.. తన నిర్ణయాన్ని సూటిగా చెప్పేశారు. తాను హిందూపురం పార్లమెంట్ తో పాటు హిందూపురం అసెంబ్లీలోనూ నిలుస్తానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ అనంత నేతల్లో టెన్షన్ మొదలైంది.

స్వామి పరిపూర్ణానంద గతకొంతకాలంగా బీజేపీలో యాక్టివ్ గా ఉంటున్నారు. హిందూత్వ అజెండాతో మతవ్యాప్తి దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దు కావడం, దక్షిణాది రాష్ట్రాలు, భాషల్లో పట్టు ఉండడం ఆయనకు  కలిసొచ్చే అంశమే. పరిపూర్ణానంద స్వతంత్రంగా పోటీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. హిందూపురం ఎంపీగా టీడీపీ బీసీ నేత పార్థసారధిని ప్రకటించింది. హిందూపురం అసెంబ్లీ నుంచి బాలయ్య మూడో సారి బరిలో ఉంటున్నారు. బాలయ్యపై ఈసారి వైసీపీ మహిళా అభ్యర్థిని పోటీకి దించింది. ఈసమయంలో స్వామిజీ నిర్ణయంతో కొత్త లెక్కలు తెరపైకి వస్తున్నాయి.

2019 ఎన్నికల్లో అనంత జిల్లాలో టీడీపీ రెండు సీట్లు మాత్రమే గెలిచింది. పయ్యావుల కేశవ్, బాలయ్య మాత్రమే గెలిచారు. రెండు ఎంపీ స్థానాలతో పాటు 12 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. తొలి నుంచి హిందూపురం లోక్ సభ పరిధిలో టీడీపీ పట్టు ఉంది. మరి ఈసారి పరిపూర్ణానంద బరిలోకి దిగితే ఎవరి ఓట్లకు దెబ్బపడుతుందోనని ఆందోళన అభ్యర్థుల్లో మొదలైంది. నామినేషన్ల సమయానికి పరిపూర్ణానందను బీజేపీ శాంతింపజేస్తుందా? లేదా ఇతర ఏదైనా అవకాశం ఇచ్చి రాజీ కుదురుస్తుందా? అనేది చూడాలి. లేదంటే హిందూపురం అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మరింత రసవత్తరం కానున్నాయి.

TAGS