Australia : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ వాసి అరటి అరవింద్ యాదవ్ (30) అస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అరవింద్ షాద్ నగర్ బీజేపీ నేత అరటి కృష్ణ ఏకైక కుమారుడు. ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియా సిడ్నీలో స్థిరపడ్డాడు. గత ఐదు రోజులుగా ఆయన కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యలు అక్కడి పోలీసులకు రిపోర్టు చేశారు. గత సోమవారం స్వదేశానికి వచ్చేందుకు కుటుంబ సభ్యులతో అరవింద్ ఏర్పాట్లు కూడా చేసుకున్నారని బంధువులు తెలిపారు.
ఆస్ట్రేలియాలో వాతావరణం పడకపోవడంతో వారం రోజుల క్రితం అతని తల్లి షాద్ నగర్ కు వచ్చింది. సోమవారం అరవింద్ కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చేందుకు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. అరవింద్ భార్య గర్భిణి. కారు వాష్ చేయించుకు వస్తానని చెప్పి వెళ్లిన అరవింద్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సముద్రంలో ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి ఆ మృతదేహం అరవింద్ దేనని పోలీసులు ధ్రువీకరించారు. అరవింద్ ది హత్యా? లేక ఆత్మహత్యా..? అనేది తేలాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.